సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నవంబర్ 11 న నిర్వహించిన పోలింగ్‌కు సంబంధించిన కౌంటింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్ కమ్ రిసెప్షన్ సెంటర్(డీఆర్సీ)ను అధికారులు ఏర్పాటు చేశారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్వహించనున్నారు. ఈమేరకు ఎన్నికల సిబ్బందికి శిక్షణ పూర్తిచేశారు.
ఉప ఎన్నికకు సంబంధించి పోలైన లక్షా 94 వేల 632 ఓట్లును.. పది రౌండ్లుగా 42 టేబుళ్లపై లెక్కింపు జరుపనున్నారు. తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత 103 హోం ఓటింగ్లను లెక్కించిన తర్వాత ఇతర ఓట్ల లెక్కింపు జరగనుంది. ఒకరు టేబుల్ సూపర్వైజర్ మరొకరు అసిస్టెంట్ టేబుల్ సూపర్ వైజర్ కాగా…మరొకరిని సహాయక సిబ్బందిగా నియమించారు. పోలింగ్ స్టేషన్ల నంబర్ 1 నుంచి 407 వరకు ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచిన ఈవీఎంలను అభ్యర్థులు, వారి కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో ఓపెన్ చేస్తారు. అయితే ఆశించినదానికంటే తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడంతో మధ్యాహ్నం ఒంటి గంటలోపే తుది ఫలితాన్ని ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది.
రౌండ్లవారీగా ఫలితాలు..
ఉదయం 8 గంటలకు ప్రారంభమయ్యే ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని మొత్తం 10 రౌండ్లుగా కొనసాగించనున్నారు. ఒక్కో రౌండ్ వారీగా ఫలితాలను వెల్లడించనున్నారు. ఎన్నికల బరిలో 58 అభ్యర్థులతో పాటు నోటాకు పోలైన ఓట్ల సంఖ్యను అధికారులు వెల్లడించనున్నారు. కాగా కౌంటింగ్ కేంద్రంలో పటిష్టమైన మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. దీనికితోడు సీసీ కెమెరాలతో పర్యవేక్షణ, సాయుధ బలగాలతో 24గంటల పహారా ఉండనుంది. స్టేడియానికి 100 మీటర్ల మేరలో ఆంక్షలు ఆమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు.