బడంగ్పేట్ : బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో అధికారులు నిబంధనలకు తిలోదకాలు ఇస్తున్నారు. బడాబాబులకు ఇంటి అనుమతి, డోర్ నంబర్ కావాలన్న నిబంధనలు ఉండవు. అధికారుల చేతులు తడిపితే చాలు. అల్మాస్గూడ వినాయక హిల్స్‌లో మూడు ఇంటి పర్మిషన్లు తీసుకొని ఒకే బహుళ అంతుస్తుల భవనం నిర్మాణం చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 240 గజాలకన్నా ఎక్కువ ఉంటే మాడ్గేజ్ మున్సిపల్ కార్పొరేషన్ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయవలసి ఉంటుంది.
240 గజాలు దాటితే పదిశాతం స్థలం మున్సిపల్ పేరు మీద చేయవలసి ఉంటుంది. మాడ్ గేజ్‌ని తప్పపించుకోవడానికి వందల గజాల స్థలానికి వేర్వేరుగా అనుమతులు తీసుకొని ఒకే భవనం నిర్మాణం చేస్తున్న విషయం అధికారులకు తెలిసినప్పటికీ చూసి చూడన్నట్లు వదిలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సెట్ బ్యాక్ వదుల కుండా నిర్మాణాలు చేపడుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అంటున్నారు.దానికే హౌస్ నంబర్ తీసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఇలాంటి వాటికి డోర్ నంబర్ ఇవ్వకూడదని కలెక్టర్ నుంచి మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారిచేశారు.
అధికార పార్టీకి చెందిన వారే ఇవ్వకూడదని ఒక వర్గం ఫిర్యాదులు చేస్తుంటే మరో వర్గం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు వైపుల నుంచి అధికార పార్టీ నాయకుల ఒత్తిడి చేయడంతో అధికారులు ఎటు తేల్చుకోలేక పోతున్నారు. ఇలాంటి భవనాలు నిర్మాణం చేసేంత వరకు అధికారులు దృష్టి పెట్టడం లేదని అనేక మార్లు పై అధికారులు చీవాట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అధికారుల నడుమ సమన్వయం లేక పోవడంతో సమస్యలు వస్తున్నాయని గుస గుసలు వినిపిస్తున్నాయి. రెసిడెన్షియల్ అనుమతి తీసుకొని ఫంక్షన్‌హాల్స్, స్కూల్స్, బహుళ అంతస్తులు నిర్మాణం చేస్తున్నట్లు అధికారుల దృష్టి వచ్చినా .. వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా కొన్నిచోట్ల అనుమతులు ఇస్తే మరో చోట అధికారులకు తెలిసి తప్పులు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాంటి డాక్యూమెంట్లు లేకుండానే ఇంటి అనుమతులు, డోర్ నంబర్లు జారీ చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. మామిడిపల్లిలో ఒక ఇల్లుకు ఆరు డోర్ నంబర్లు జారీ చేసిన ఉదంతాలున్నాయి.డాక్యూమెంట్లు లేకుండా డోర్ నంబర్లు జారీ చేయడం ద్వారా ప్లాట్‌ను రిజిస్ట్ట్రేషన్ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. ఇదంతా అధికారుల తప్పిదం వల్లనే జరుగుతుందని కొందరు ఆరోపిస్తున్నారు. ఇకనైనా పై అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.