సిటీబ్యూరో, జూన్ 16 (నమస్తే తెలంగాణ): ఆబ్కారీలోనూ ఆన్లైన్ విధానానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పోలీస్ శాఖ తరహాలోనే ఆబ్కారీ శాఖలో కూడా పరిపాలనకు సంబంధించిన అంశాలతో పాటు ఎఫ్ఐఆర్ల నమోదు తదితర అంశాలను సైతం ఆన్లైన్ విధానంలోకి తీసుకువచ్చేందుకు ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ప్రభుత్వాన్ని నడిపించడంలో ఆర్థికంగా కీలక పాత్ర పోషించే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ దురదృష్టవశాత్తు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ విభాగాలు డిజిటలైజేషన్తో పరుగులు తీస్తుంటే తెలంగాణ ఆబ్కారీ శాఖలో మాత్రం ఇంకా మ్యాన్వల్ పద్ధతితోనే సర్థుకు పోతున్నారు. దీనిపై ఆలస్యంగా స్పంధించిన ఆబ్కారి అధికారులు ఎట్టకేలకు ఆన్లైన్ విధానానికి శ్రీకారం చుట్టారు.
ఇక నుంచి ఆన్లైన్లోనే ఎఫ్ఐఆర్
ప్రస్తుతం ఆబ్కారీ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 139ఎక్సైజ్ స్టేషన్లు ఉన్నాయి. ఈ స్టేషన్ల పరిధిలో ఆబ్కారీ నేరాలకు పాల్పడే వారిపై ఇప్పటి వరకు మ్యాన్వల్ పద్ధతిలోనే ఎఫ్ఐఆర్లను నమోదు చేస్తున్నారు. అంతే కాకుండా ఆబ్కారీ శాఖలోని పలు రకాల కార్యకలాపాలను సైతం మాన్యువల్ పద్ధతిలోనే నిర్వహిస్తున్నారు. మ్యాన్వల్ పద్ధతిలో జారీ చేసే ఎఫ్ఐఆర్లలో అవకతవకలకు ఆస్కారం లేకపోలేదు. అంతే కాకుండా కేసుల నమోదులో కూడా పారదర్శకత ప్రశ్నార్థకమే. ఈ అంశాలను పరిగణలోకి తీసుకున్న అధికారులు అధికారుల్లో జవాబుదారితనం పెంచడం, పనితనంలో పారదర్శకత తదితర వాటికోసం అన్ని ఎక్సైజ్ స్టేషన్లలో ఇక నుంచి ఎఫ్ఐఆర్ నమోదులో మ్యాన్వల్ పద్ధతికి స్వస్తి పలికి, ఆన్లైన్ పద్ధతిలో నమోదు చేయనున్నట్లు ఆబ్కారీ ఈడీ షానవాజ్ ఖాసిం వెల్లడించారు.
ఆగస్టు నుంచి అమల్లోకి ఆన్లైన్ విధానం:
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆబ్కారీ స్టేషన్లలో ఆగస్టు నుంచి ఆన్లైన్ విధానాన్ని అమల్లోకి తీసుకు వచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం నాంపల్లిలోని ఆబ్కారీ భవన్లో ఎస్ఐసీ సంస్థ సాంకేతిక నిపుణులు, ఎక్సైజ్ అధికారులతో ఆబ్కారీ ఈడీ షానవాజ్ ఖాసిం సమావేశమయ్యారు. పోలీసు శాఖ తరహాలోనే ఎఫ్ఐఆర్ నమోదు, కేసుల దర్యాప్తు పురోగతితో పాటు ఇతర అంశాలను సైతం ఆన్లైన్ పద్ధతిలోకి తీసుకురావడానికి అవసరమైన అంశాలపై చర్చించారు. ఈ నెల 25న జరిగే సమావేశంలో ఆన్లైన్ విధానంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ఆన్లైన్ విధానానికి సంబంధించిన సాంకేతికత అంశాల రూపకల్పకు జూలైలోపు తుది రూపం ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.