Hyderabad | అంబర్పేట, మార్చి 26 : ఉపాధికోసం నగరానికి వచ్చిన ఓ వ్యక్తి అనుమానస్పదస్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన నల్లకుంట పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ జగదీశ్వర్రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రానికి చెందిన కాలా చందర్ ఉపాధి కోసం మంగళవారం సాయంత్రం నగరానికి వచ్చాడు. శివంరోడ్డులో గల శాంతి వెజిటేరియన్ హోటల్లో పనిచేసే ఒడిశాకు చెందిన తన స్నేహితుడు పాండు దగ్గరకు వచ్చాడు. తనకు పని కావాలని అడిగాడు. అయితే అతను రోటీ మేకర్ కావడంతో ఇప్పుడే తమ వద్ద పని లేదని, ఇంకా రెండు నెలల సమయం పడుతుందని చెప్పాడు. రాత్రి 10.30కి భోజనం చేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు.
అనంతరం హైటెక్ సిటీలో ఉండే తమ ఊరికి చెందిన బంధువుల దగ్గరకు వెళ్తానని చెప్పి వెళ్లాడు. బుధవారం ఉదయం 6 గంటలకు హోటల్ తెరిచే సమయానికి హోటల్ ముందు శవమై పడి ఉన్నాడు. ఇది గమనించిన హోటల్ యాజమాన్యం వెంటనే నల్లకుంట పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానకు తరలించారు.
క్లూస్ టీం, డాగ్ స్వ్కాడ్ బృందాలను ఘనట స్థలానికి తీసుకువచ్చారు. అయితే అతనికి బాగా మద్యం తాగే అలవాటు ఉందని, మంగళవారం రాత్రి బాగా తాగడంతోనే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఊర్లో కూడా బాగా తాగేవాడని, నగరానికి వచ్చి బాగుపడతాడేమోనని వాళ్ల కుటుంబ సభ్యులు ఇక్కడకు పంపించారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టులో అన్ని విషయాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.