సిటీబ్యూరో, అక్టోబర్ 10 (నమస్తే తెలంగాణ): ఒడిశాలో కిడ్నాపైన బాలుడి కేసును 24 గంటల్లో ఛేదించిన ఐటీ సెల్, ఎస్ఓటీ పోలీసులను రాచకొండ సీపీ సుధీర్‌బాబు అభినందించారు. ఒడిశాలోని కొమ్న పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ బాలుడి గతనెల 29న కిడ్నాప్ అయ్యాడు. నిందితులు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నట్లు గుర్తించిన ఒడిశా పోలీసులు గురువారం రాచకొండ పోలీస్ కమిషనర్‌ను సంప్రదించారు.
వెంటనే ఐటీసెల్తో పాటు భువనగిరి ఎస్ఓటీ, బొమ్మల రామారం పోలీసులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. బాలుడిని కిడ్నాప్ చేసిన ఒడిశాకు చెందిన దుర్యోధన్ భర్హి, పద్మిని మాజీ తూంకుంట గ్రామ పరిధిలో బ్రిక్స్ తయారు చేసే చోట షెల్టర్ తీసుకున్నట్లు గుర్తించి, పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బాలుడిని సురక్షితంగా ఒడిశా పోలీసులకు అప్పగించారు. భువనగిరి డీసీపీ రాజేశ్ చంద్ర, ఎస్ఓటీ డీసీపీ రమణారెడ్డితో పాటు సిబ్బందిని సీపీ అభినందించారు.