ట్రై కార్పొరేషన్ పరిధిలో నిర్మాణ రంగ అనుమతులు పొందాలంటే కత్తి మీద సాములా మారింది. నిర్మాణదారులకు సకాలంలో పర్మిషన్లు జారీ చేయాల్సిన జోనల్ కార్యాలయాలు ఇప్పుడు పెండింగ్ ఫైళ్లకు అడ్డాగా మారాయి. ఒకో జోనల్ కమిషనర్ ఆధీనంలో పదుల సంఖ్యలో ఫైళ్లు నెలల తరబడి మూలుగుతున్నాయి. ఈ జాబితాలో సికింద్రాబాద్, ఎల్బీనగర్, ఖైరతాబాద్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ జోన్లలో భారీ స్థాయిలో నిర్మాణ రంగ దరఖాస్తులకు మోక్షం దక్కడం లేదు. ఖరీదైన ప్రాంతంలో ఉన్న ఓ జోనల్ కమిషనర్ ఏకంగా నిర్మాణదారుడికి ఫోన్ చేయడం. తన వ్యక్తిగత డ్రైవర్ను కలిసిన తర్వాతే అనుమతులు మంజూరు చేస్తున్నట్లు హాట్ హాట్ చర్చ జరుగుతున్నది. మిగతా జోన్లలో టౌన్ ప్లానింగ్ అధికారులు బినామీలను పెట్టుకుని సైజు విజిట్ నుంచి ఫైల్ అఫ్రూవల్ వరకు వారి కనుసైగల్లో తంతును నడుపుతున్నట్లు ప్రచారం సాగుతున్నది. ఓసీల జారీలోనూ చాలా వరకు జోన్లలో ముప్పు తిప్పలు పెడుతున్నారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ) : పెద్ద సంస్థలకు, కార్పొరేట్ బిల్డర్లకు గంటల వ్యవధిలోనే అనుమతులు ఇస్తున్న యంత్రాంగం.. మధ్యతరగతి ప్రజలు, చిన్న నిర్మాణదారుల విషయంలో మాత్రం అధికారులు చుకలు చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండటంతో చిన్న బిల్డర్లు ఆర్థికంగా చితికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్యాలయానికి వెళ్తే కమిషనర్లు అందుబాటులో ఉండరని, ఉన్నా సరైన సమాధానం చెప్పడం లేదని బాధితులు మండిపడుతున్నారు.
పెండెన్సీపై సమీక్షలు ఎక్కడ?
పెరుగుతున్న పెండెన్సీపై ట్రై కార్పొరేషన్ల కమిషనర్లు, సీసీపీల పర్యవేక్షణ కరువైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ఫైలు ఎందుకు పెండింగ్లో ఉంది? జాప్యానికి కారణమెవరు? అనే విషయాలను విశ్లేషించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పం దించి, జోనల్ కార్యాలయాల్లో పేరుకుపోయిన ఫైళ్లను సత్వరమే క్లియర్ చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.