రామగిరి, జూలై 18 : నల్లగొండ జిల్లా కేంద్రంలోని నల్లగొండ పబ్లిక్ స్కూల్లో శనివారం ‘సాంప్రదాయ దినోత్సవం (ట్రెడిషనల్ డ్రెస్ డే) వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించే విధంగా పాఠశాల ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని ప్రీ-ప్రైమరీ విద్యార్థులంతా వివిధ రకాల సాంప్రదాయ దుస్తులను ధరించి వచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల వేషధారణలు పాఠశాలలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధులు మాట్లాడుతూ.. సాంప్రదాయాలు అనేవి మనకు ఐకమత్యం, క్రమశిక్షణ, మంచి విలువలను నేర్పుతాయని, చిన్నతనం నుంచే పిల్లలకు వీటిపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా సాంప్రదాయ దుస్తులలో మెరిసిన చిన్నారులను పాఠశాల అధ్యక్షుడు జిగిని భీమయ్య, కార్యదర్శి అమరేందర్ రావు, కోశాధికారి పుల్లెల వెంకట్ నారాయణ రావు, ప్రిన్సిపాల్ పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు.