ఖైరతాబాద్, డిసెంబర్ 8 : నిమ్స్‌లో దీర్ఘకాలికంగా పెండింగ్‌లో తమ సమస్యలను పరిష్కరించడం లేదంటూ నర్సింగ్ ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. నిమ్స్ నర్సెస్ యూనియన్ అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు ఎస్. ఆశాలత, తేజావత్ కృష్ణలు మాట్లాడుతూ ఈఎల్ ఎన్క్యాష్మెంట్స్ను నిమ్స్ ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఆమోదించినా యాజామన్యం పట్టించుకోవడం లేదన్నారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.56 ప్రకారం గ్రాట్యూటీ మొత్తాన్ని రూ.16లక్షల వరకు పెంచి అమలు చేయాలని, జీవోఎంఎస్ నం. 209 ప్రకారం మూడు నెలల శిశు సంరక్షణ సెలవులను మంజూరు చేయాలన్నారు.
కానీ, యాజమాన్యం పట్టింపు లేని దోరణి అవలంభిస్తుందన్నారు. నిమ్స్‌లో ఖాళీగా ఉన్న పోస్టులకు శాశ్వత నియామకాలు చేపట్టాలని, కాంట్రాక్ట్ నర్సింగ్ అధికారులను క్రమబద్దీకరించాలని, క్లినికల్ నర్సింగ్ అధికారులు, నిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సిబ్బందికి జాతీయ నర్సింగ్ కౌన్సిల్ ప్రకారం సరైన హోదా కల్పించాలన్నారు. నర్సింగ్ ఉద్యోగులకు సంవత్సరానికి వైద్య పరీక్షల సౌకర్యం కల్పించాలని, సూచించిన మందులను పూర్తి స్థాయిలో సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ నర్సింగ్ ఆఫీసర్స్ కుటుంబీకులకు కూడా నిమ్స్‌లో వైద్య సేవలను పునరుద్దరించాలన్నారు. మెడికల్ సప్లయిస్‌ను సమృద్ధిగా అందించాలని, చీఫ్ నర్సింగ్ ఆఫీసర్, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్‌కు ప్రత్యేక కార్యాలయ గదులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కేవలం నర్సింగ్ అధికారుల్లో కొనసాగుతున్న వ్యత్యాసాన్ని తొలగించాలని, మోడల్ క్యాలెండర్ ప్రకారం ప్రమోషన్ విధానం అమలు చేసి ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని కోరారు.