సిటీబ్యూరో: నగరంలో చెరువుల హద్దుల నిర్ధారణ, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లతో కూడిన ఫైనల్ నోటిఫికేషన్ చేయాల్సి ఉంది. చెరువు హద్దుల నిర్ధారణను హైకోర్టు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నా… ప్రక్రియ చేపట్టడంలో అధికారులు తప్పులు చేస్తూనే ఉన్నారని పర్యావరణ, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నగరంలో ఎర్రకుంట, నాచారం లేక్‌ల విషయంలోనూ అధికారులు రూపొందించిన ప్రిలిమినరీ నోటిఫికేషన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ… తప్పులకు తావు లేకుండా చెరువులకు హద్దులు గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ హెచ్ఎండీఏ అధికారుల నిర్లక్ష్యం, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య లోపిస్తున్న సమన్వయం… నగరంలో చెరువుల నిర్వహణ దారుణంగా మారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.
చెరువులకు పొంచి ఉన్న ప్రమాదం
తార్నాక సమీపంలో ఎర్రకుంట, నాచారం లేక్ విషయంలో తప్పుడు కాడస్ట్రాల్ మ్యాపులు, సర్వే నెంబర్లతో వివరాలతో తప్పుగా రూపకల్పన చేసిన ఎఫ్టీఎల్ మ్యాపులతో చెరువులకు ప్రమాదం పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిబంధనలను అతిక్రమిస్తూ ఇతర చెరువుల మ్యాపులతో తప్పుడు నివేదికలను రూపకల్పన చేసి వెబ్సైట్లో పొందుపరుస్తున్నట్లు పర్యావరణవేత్త లుబ్నా సార్వత్ ఆగ్రహం వక్తం చేశారు. తార్నాకలోని ఎర్రకుంట చెరువుకు సమీపంలో ఉండే రెండు కుంటలను మాయం చేసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
ఎర్రకుంటకు ఉత్తరాన 5ఆర్, 6 ఆర్ లేక్‌లను జాబితా నుంచి తొలగించి, 3ఆర్ లేక్ కోసం తప్పుడు, ఎఫ్టీఎల్, కాడస్ట్రాల్ మ్యాపులను తయారు చేసి, దానికి ఎర్రకుంట లేక్ ఐడీ 4500గా లెక్కించారని మండిపడ్డారు. ఉత్తరాన ఉన్న లేక్‌లను తొలగించడంతోపాటు, ఎర్రకుంటను రెండుగా విభజించి, ఎఫ్టీఎల్, కాడస్ట్రాల్ మ్యాప్‌లను రూపొందించి దానికి లేక్ ఐడీ 3806గా మారినట్లు ఆరోపించారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాపులో ఉన్న రెండు చెరువుల వివరాలు రెవెన్యూ, హెచ్ఎండీఏ, ఇరిగేషన్ శాఖలు కలిసి రూపొందించిన మ్యాపులలో ఎలా లేకుండా పోతుందని ప్రశ్నించారు. ఇప్పటివరకు హెచ్ఎండీఏ లేక్ జాబితాలోని లేక్ ఐడీ 4500, లేక్ 3806 కాడస్టల్,్ర ఎఫ్టీఎల్ రెండు ఒకేలా ఉన్నాయని, కానీ వేర్వేరు సర్వే నెంబర్లతో వీటిని తయారు చేసి వెబ్సైట్లో అప్లోడ్ చేసినట్లుగా ఆరోపించారు.