మేడ్చల్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం అద్దెలు చెల్లించడంలేదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధులు లేవని దాటేస్తున్నది. 16 నెలలుగా అద్దెలు చెల్లించకపోవడంతో రూ.60 లక్షల దాకా బకాయిలు పేరుకుపోయాయి. దీంతో భవన యజమానులు ఎస్సీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులకు నోటీసులు పంపించారు. సకాలంలో బిల్లులు చెల్లించాలని పేర్కొన్నారు.
మరో నెల వేచి చూసి అప్పటికీ అద్దెలు చెల్లించకపోతే ఖాళీ చేయించేందుకు మరో నోటీస్ పంపేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 13 ఎస్సీ సంక్షేమ వసతి గృహాలు ఉండగా.. ఇందులో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారంలో 2, ఉప్పల్ నియోజకవర్గం ఈసీఐఎల్‌లో 1, మేడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్‌లోని ఒక వసతి గృహం అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇంటర్ నుంచి పీజీ చదివే విద్యార్థులు ఈ వసతి గృహాల్లో ఉంటున్నారు.
గతానికి భిన్నంగా..
బీఆర్ఎస్ ప్రభుత్వం గురుకులాలతో పాటు ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు ఠంచన్‌గా అద్దెలు చెల్లించేది. ఏ ఒక్క నెల సైతం పెండింగ్ పెట్టలేదు. ఎన్నో హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి సర్కార్ మాత్రం ఎస్సీ సంక్షేమ వసతి గృహాల అద్దె చెల్లింపుల విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్నది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న వసతి గృహాల్లో వందలాది మంది ఎస్సీ విద్యార్థులు ఉంటున్నారు. నిమ్న వర్గాలు, కులాలకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు అద్దెలు చెల్లించకపోవడంపై అనేక విమర్శలు వస్తున్నాయి.