సిటీబ్యూరో, జూలై 15(నమస్తే తెలంగాణ): కొంతకాలంగా హెచ్టీ కనెక్షన్లకు బిల్లులు కట్టకుండా వాటిని వదిలేసి కొత్తకనెక్షన్లు తీసుకున్న బకాయిదారులకు నోటీసులు జారీ చేయడంతో పాటు వారి ప్రాంగణాల వద్ద బకాయిల నోటీసు బోర్డులు టీఎస్ఎస్పీడీసీఎల్ సిబ్బంది ఏర్పాటు చేస్తున్నారు. మొండి బకాయిల వసూలుకు డిస్కం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ నోటీసు బోర్డులు ఏర్పాటు చేసినట్లు సీఎండీ ముషారఫ్ ఫరూఖీ తెలిపారు.
బిల్ స్టాప్డ్ హెచ్టీ సర్వీస్ కలిగి ఉన్న ప్రాంగణాల ముందు తమకు రావాల్సిన బకాయిల మొత్తం పేర్కొంటూ నోటీసు బోర్డులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం సంస్థ పరిధిలో 728 బిల్ స్టాప్డ్ హెచ్టీ కనెక్షన్లు ఉన్నాయని ఆ సర్వీసులు ఇప్పుడు వాడకంలో లేవన్నారు. వీటికి సంబంధించి రూ. 600 కోట్లు బకాయిలు ఉన్నాయని, బిల్లుల వసూలుకు సంబంధించి ఎన్ని సార్లు వారిని సంప్రదించినా ఎలాంటి స్పందనా లేకపోడంతో ఈ చర్యలకు పూనుకున్నామన్నారు.
అదే విధంగా 9.19 లక్షల బిల్ స్టాప్డ్ ఎల్టీ సర్వీసుల నుంచి దాదాపు రూ.188 కోట్లు రావాల్సిఉన్నదన్నారు. అత్యధికంగా బకాయిపడ్డ హెచ్టీ బిల్ స్టాప్డ్ సర్వీసుల నుంచి రావాల్సిన బకాయిల వసూలుకు స్పెషల్ డ్రైవ్ చేపట్టామని, ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు వసూలయ్యాయని సీఎండీ తెలిపారు. ఇప్పటికే విద్యుత్ శాఖకు రావాల్సిన బకాయిల వివరాలను, వాటికి లింక్ చేయబడ్డ ఆస్తుల సమాచారాన్ని రిజిస్టేష్రన్ డిపార్ట్మెంట్కు అందజేశామని, దీనికి తోడు కలెక్టర్లకు కూడా బకాయిల వివరాలు అందించినట్లుగా తెలిపారు.