మియాపూర్, అక్టోబర్ 30: నోటాకు కూడా ఈ ఎన్నికల్లో తగిన గుర్తు లభించింది. తొలిసారిగా ఎన్నికల సంఘం నోటాకు కూడా గుర్తును కేటాయించింది. కంట్రోల్ యూనిట్లో ఉన్న పోటీలోని అభ్యర్థుల వరుస సంఖ్య చివర 16వ గుర్తుగా నోటా ఉంటున్న విషయం తెలిసిందే. ఈ సారి జరిగే ఎన్నికల్లో నోటాకు ప్రత్యేక గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. 2013లో తొలిసారిగా నోటాను ఎన్నికల సంఘం అమలులోకి తెచ్చింది. పోటీ చేసే అభ్యర్థులెవరూ నచ్చని పక్షంలో నోటాకు ఓటు వేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం ఓటరుకు కల్పించింది. నోటా ప్రవేశపెట్టిన నాటి నుంచి బ్యాలెట్ యంత్రంపై ‘నోటా’ అనే ఆంగ్ల అక్షరాన్ని ముద్రించి ఉండేది. అయితే, వచ్చే నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో తొలిసారిగా ఎన్నికల సంఘం నోటాకు కూడా ఓ గుర్తును కేటాయించింది. ఈ గుర్తుపై ఓటర్లకు అవగాహన కల్పించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎన్నికల అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు గత నెలలో ఎన్నికల అధికారులు వీవీ ప్యాట్స్తో ప్రజల మధ్యకు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంలోనే నోటాపై ఓటర్లకు అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా.. గత ఎన్నికలలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో నోటాకు 3500 వరకు ఓట్లు పడ్డాయన్న విషయాన్ని అధికారులు గుర్తు చేశారు.