Hyderabad Metro | నగరంలో మెట్రో విస్తరణలో గాలి మాటలు, నీటి మూటలు అన్న చందంగా మారిపోయింది. ప్రజా ప్రయోజనాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోకుండా జరుగుతున్న ప్రణాళికలపై ఆగ్రహం వ్యక్తం అవుతుంది. సుదీర్ఘకాలంగా నార్త్ సిటీకి రవాణా సౌకర్యాలు కల్పించాలని ఆందోళనలు చేస్తున్నారు. ఇక ఇచ్చిన హామీలను మరిచి… మేడ్చల్ వరకు మెట్రో ప్రతిపాదనలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టేస్తోంది. తాజాగా ఫోర్త్ సిటీ లక్ష్యంగా ప్రతిపాదించిన మెట్రో ఫేజ్-2లో నార్త్ సిటీని పరిగణనలోకి తీసుకోకుండానే రూపొందించిన డీపీఆర్‌కు రేవంత్ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అవే ప్రతిపాదనలతో కేంద్ర సాయం కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. మూడో దశ విస్తరణలో నార్త్ సిటీకి మెట్రో అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ఉత్త మాటలేనని వెల్లడైంది. ఒకవేళ ప్రభుత్వం అన్నట్లు మూడో దశలో నార్త్ సిటీకి మెట్రో నిర్మించాలంటే… అప్పటికే నిర్మించిన ఎలివేటెడ్ కారిడార్‌తో సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. దీంతోపాటు రెండో దశ మెట్రో విస్తరణ అందుబాటులోకి రావడానికి కనీసం 8 నుంచి 12 ఏళ్లు పట్టే అవకాశం ఉండగా… కొత్త ప్రతిపాదనలకు అప్పటివరకు తావే ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
– సిటీబ్యూరో, నవంబర్ 19(నమస్తే తెలంగాణ)
గేట్ వే ఆఫ్ నార్త్ తెలంగాణగా పిలిచే హైదరాబాద్ ఉత్తర ప్రాంతానికి మెట్రో విస్తరణలో తీవ్ర అన్యాయమే జరుగుతుంది. మల్కాజిగిరి ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచిన తర్వాత… మెట్రో రైలు తీసుకువస్తానంటూ ఇచ్చిన హామీని మరిచారు. రాష్ర్టానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆ ప్రతిపాదనలకు నీళ్లొదిలేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. దీంతో తమ ప్రాంతానికి తీరని అన్యాయమే జరుగుతుందని నార్త్ సిటీ వాసులు మండిపడుతున్నారు. మేడ్చల్ వరకు మెట్రోను విస్తరించాలని కొంతకాలంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి ఉద్యమిస్తోంది. కానీ ఏనాడు మెట్రో సాధన సమితి ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకోలేదు. నార్త్ సిటీలో కారిడార్‌లోని ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ నుంచి శామీర్‌పేట్ వరకు, తార్నాక నుంచి కీసర, బోయిన్పల్లి నుంచి మూసాపేట్ వై జంక్షన్ వరకు ఇలా నార్త్ సిటీలో మెట్రో విస్తరించాలని స్థానికులు ఆందోళన చేస్తున్నారు. నిత్యం ప్రజాప్రతినిధులతో సంప్రదింపులు, సమావేశాలు, ఆందోళనలు, నిరసనలతో మెట్రో సాధనకు ఉద్యమిస్తున్నారు. ఇవేవి పట్టనట్లు కాగితాలకే పరిమితమైన ఫోర్త్ సిటీకి మెట్రోను విస్తరిస్తూ, మూడో దశలో నార్త్ సిటీకి మెట్రో అంటూ ప్రభుత్వం మభ్యపెడుతుందని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్పందించిన కేంద్ర ప్రభుత్వం..
ఫేజ్-2 కింద రూ. 23వేల కోట్లతో నగరంలో 76 కిలోమీటర్ల మేర మెట్రో లైన్‌ను విస్తరించడానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. ఇందులో నార్త్ సిటీని పరిగణనలోకి తీసుకోలేదు. మేడ్చల్‌కు మెట్రో విస్తరించాలని కోరుతూ 9 నెలల కిందటే ప్రధాని మోదీకి మెట్రో సాధన సమితి లేఖలతో సంప్రదింపులు చేసింది. దీనిపై స్పందించిన కేంద్రం రాష్ట్ర ఎంఏయూడీ శాఖకు లేఖతో ఆదేశాలు జారీ చేసింది. స్థానికుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ర్టానికి స్పష్టం చేసింది. కానీ అవేవి పట్టించుకోకుండానే ప్రభుత్వం ఫోర్త్ సిటీకి మెట్రో ప్రతిపాదనలతోపాటు, కేంద్రం సాయాన్ని కోరుతూ ముందుకు వెళ్తోంది.
మూడో ఫేజ్ ఉత్త మాటలే..
నిజానికి రెండో దశ పనులు చేపట్టడానికే ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాలు ఫేజ్-2ను కలవరపడేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ మూడో ఫేజ్ విస్తరణలో నార్త్ సిటీ ఉంటుందని చెప్పడం వెనుక దాటవేసి ధోరణే కనిపిస్తోందని అభిప్రాయపడుతున్నారు. రెండో దశ పూర్తి కావడానికి కనీసం 10ఏళ్లు పట్టనుంది. ఒకవేళ మూడో దశలోనైనా మెట్రో విస్తరించాలని భావించినా.. ఆ ప్రాంతంలో అప్పటికే నిర్మితమయ్యే ఎలివేటెడ్ కారిడార్ ప్రధానమైన అడ్డుగా మారనుంది. ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం రోడ్డు వరకు, జేబీఎస్ నుంచి తూంకుంట వరకు ప్రతిపాదిత ఎలివేటెడ్ కారిడార్ డబుల్ డెక్కర్ కాదని తేలింది. ఇక ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే నార్త్ సిటీకి మెట్రో విస్తరణ అనేది సాధ్యం కాదని వాపోతున్నారు.
రెండో దశలోనే మెట్రో నిర్మించాలి..
రెండో దశ ప్రతిపాదనల్లోనే నార్త్ సిటీ ప్రాంతాలను పరిగణనలోకి తీసుకుని డీపీఆర్‌ను రివైజ్ చేయాలి. నార్త్ సిటీకి మూడో దశలో అవకాశం కల్పిస్తామని చెప్పడం వెనుక పెద్ద కుట్రే ఉంది. దీంతో భవిష్యత్తులో నార్త్ సిటీ మెట్రో ఆశలను నీరుగార్చే ప్రయత్నమే. చెన్నయ్ నగరానికి ఏడేళ్లుగా మెట్రో పెండింగ్‌లో ఉంటే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాని మోదీతో ఒక్కసారి సమావేశమై.. ఏకంగా రూ. 60వేల కోట్ల మెట్రో ప్రతిపాదనలకు ఆమోదం పొందారు. కానీ కేంద్రంతో సంప్రదింపులు చేయకుండా.. ఉద్దేశపూర్వకంగానే నార్త్ సిటీని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెడుతున్నది. మూడో దశ పేరిట మభ్యపెడితే.. భవిష్యత్తులో తమ ప్రాంతానికి మెట్రో నిర్మాణం సాధ్యపడదు. ఎప్పుడో మొదలైన మొదటి దఫా మెట్రో పూర్తి కావడానికి కనీసం 15ఏళ్లు పట్టింది. ఇక ప్రతిపాదనలు సిద్ధమైన ఫేజ్-2 పూర్తి కావడానికి మరో 10ఏళ్లు పట్టవచ్చు. ఇంకా ప్లానింగ్ చేయని ఫేజ్-3లో మెట్రో వస్తుందంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు.
– మేడ్చల్ మెట్రో సాధన సమితి