సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ): నగరంలో శబ్దకాలుష్యం మోతమోగిస్తున్నది. ఒకవైపు వాహనాల హారన్లు.. సైలెన్సర్లు..విపరీతమైన ధ్వని పుట్టిస్తుంటే..మరోవైపు రాత్రి వేళల్లో సౌండ్ సిస్టమ్‌ల మోత గుబగుయ్యిమనిపిస్తున్నాయి. నగరంలో శబ్దకాలుష్యం ఈ రేంజ్లో ఉంటున్నా.. పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీంతో సామాన్యులు న్యాయస్థానాల
తలుపు తడుతున్నారు.
ఒకప్పుడు శివారు ప్రాంతాల్లో ఉండే ఫంక్షన్ హాల్స్ నేడు.. కాలనీలో మధ్యలోకి వచ్చేశాయి.. నిబంధనల ప్రకారం రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు సౌండ్ సిస్టమ్స్ ఉపయోగించకూడదు. అయితే ఫంక్షన్ హాల్స్‌లో రాత్రి 12 అయినా..కొందరు సౌండ్ సిస్టమ్స్‌ను వాడుతూ.. శబ్ద కాలుష్యానికి కారణమవుతున్నారు. సాధారణంగా ఫంక్షన్ హాల్స్‌లలో ఇలాంటి పరిస్థితి ఉంటుంది.. ఒకటి రెండు రోజులంటే చూసీచూడనట్లు ఉన్నా.. నిత్యం శబ్దాల మోత మోగుతుండటంతో ఎలా భరించాలని సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డయల్ 100కు ఫోన్ చేస్తే కొన్ని సందర్భాల్లో పోలీసులు రానే రాను.. వచ్చినా తాత్కాలికంగా నిర్వాహకులకు చెప్పి..బంద్ చేయించి వెళ్లడం, వెంటనే తిరిగి సౌండ్ సిస్టమ్స్‌ను ప్రారంభించడం జరుగుతున్నది.పోలీసులకు, ఆయా ఫంక్షన్ హాల్ యజమానులకు మధ్య ఉండే సంబంధాలతోనే ఈ వ్యవహారంలో చూసీచూడనట్లు ఉంటున్నారన్న ఆరోపణలు లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి తన ఆవేదనను వ్యక్తం చేస్తూ లేఖ రాశారు. ఆ లేఖను కోర్టు సుమోటగా విచారణకు స్వీకరించింది.
గతంలో తరచూ స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తూ సౌండ్ పొల్యూషన్‌కు కారణమయ్యే వాహనాదారులపై చర్యలు తీసుకునే వారు. నేడు ఆ పరిస్థితి లేదు. రోడ్లపై శబ్ద కాలుష్యం పెరిగిపోతున్నది. వాహనాలను తనిఖీ చేయడమే కాకుండా సైలెన్సర్లు మరమ్మతులు చేసే మెకానిక్‌లు.. హారన్లను బిగించే కార్ డేకార్స్ నిర్వాహకులతో సమావేశాలు ఏర్పాటు చేసేవారు. చట్ట ప్రకారం అది తప్పుడు అలా చేయకూడదని చెబుతూ, మాట వినని వారిపై చర్యలు కూడా తీసుకునే వారు. నేడు ఆ పరిస్థితి లేదు. అసలు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందకే ఇబ్బందిపడుతున్న ట్రాఫిక్ పోలీసులు, ఈ విషయాలను మర్చిపోయారనే విమర్శలు వస్తున్నాయి.
హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని ఫంక్షన్ హాల్స్‌లో శబ్దానికి పరిమితులు ఉన్నాయని హైకోర్టు గుర్తుచేసింది. పరిమితులకు లోబడే శబ్దం ఉండాలని చెప్పింది. నగరంలో ఫంక్షన్ హాళ్లలో శబ్ద నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం ఈనెల 5న జారీ చేసిన ఉత్తర్వుల్లోని నిబంధనలు అమలుపై స్థాయీ నివేదిక అందజేయాలని కోరింది. సర్యూలర్లోని అంశాల అమలు వివరాలు అందజేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సికింద్రాబాద్ తాడ్‌బండ్ బోయినపల్లిలోని బ్రాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాళ్లపై చర్యలు తీసుకోవాలని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డును ఆదేశించింది. ఆ రెండు గార్డెన్స్ లను ప్రతివాదులుగా చేర్చాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి వాయిదా వేసింది.