సిటీబ్యూరో, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): వచ్చే వేసవిలో దాదాపు 5వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కావొచ్చని, వినియోగం 1.10 కోట్ల యూనిట్లకు చేరుకోవచ్చని టిజిఎస్పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫరూఖి తెలిపారు. వేసవిలో నిరంతరాయ విద్యుత్ సరఫరాకు అనుగుణంగా జూన్ వరకు విద్యుత్ ఉద్యోగులు, అధికారులు ఎవరూ సెలవులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసినట్టు తెలిపారు. గ్రేటర్ పరిధిలో 450 విద్యుత్ సబ్స్టేషన్లను సిద్దం చేశామని, అధిక లోడ్‌కు చేరువలో ఉన్న దగ్గర 152 పవర్ ట్రాన్స్ఫార్మర్లను, 5042 డిస్టిబ్య్రూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేశామని తెలిపారు.
అధికలోడ్ ఉన్న 33కేవీ 152 ఫీడర్లను, 11కేవీకి చెందిన 842 ఫీడర్లను విభజించి భవిష్యత్‌లో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుం డా ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. గ్రేటర్ పరిధిలోని అన్ని విద్యుత్ సబ్స్టేషన్లను ముందస్తుగా మరమ్మత్తులు చేశామని, డిమాండ్‌కు తగినట్లుగా అవసరమైన చోట ఫీడర్ల ఏర్పాటు, అదనపు పవర్ ట్రాన్స్ఫార్మర్లు, డిస్టిబ్య్రూషన్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేశారు. అధికలోడ్ ఉన్న ఫీడర్లపై మరింత భారంపడి సరఫరాలో అంతరాయం వచ్చే అవకాశం ఉన్న వాటిని గుర్తించి 842 అదనంగా ఫీడర్లు ఏర్పాటు చేసినట్లు ముషారఫ్ పేర్కొన్నారు.