Street Lights | హిమాయత్ నగర్, జూన్ 24 : వీధి దీపాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. అధికారుల పర్యవేక్షణ లేక పలు ప్రాంతాల్లో సమస్య జఠిలమై వీధుల్లో చీకట్లు కమ్ముకుంటున్నాయి. నిర్వహణను విస్మరించడంతో కొన్ని చోట్ల రోజంతా వెలుగుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ చీకట్లు నెలకొంటున్నాయి. బస్తీలు, కాలనీలు అంధకారం నెలకొనడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా వీధి దీపాల ఏర్పాటు, నిర్వహణ కోసం లక్షల రూపాయాలు ఖర్చు చేస్తున్న వెలుగులు పంచకపోవడంతో రాత్రివేళ్లలో భయంతో వాహనదారులు రాకపోకలు సాగిస్తున్నారు. కొన్ని నెలలుగా సమస్య నెలకొన్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు.
హిమాయత్ నగర్ డివిజన్ పరిధిలో దాదాపు 800కు పైగా వీధి దీపాలు ఉండగా వాటిలో కొన్ని మాత్రమే వెలుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటిలో కొన్ని వీధి దీపాలు టైమర్ల సహాయంతో ఆటోమెటిక్‌గా వెలగడం, ఆఫ్ అవుతుండగా మిగిలిన వాటిన్నింటినీ మ్యాన్వల్ గానే నిర్వహిస్తున్నారు. నారాయణగూడ, హైదర్‌గూడ, హిమాయత్ నగర్, చంద్రానగర్, కింగ్ కోఠి, ముత్యాల్ బాగ్ తదితర ప్రాంతాల్లో వీధి దీపాలు వెలుగకపోవడంతో కారు చీకట్లు అలుముకున్నాయి. రాత్రి సమయంలో చీకటిగా ఉండటం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నామని స్థానికులు, వాహనదారులు వాపోతున్నారు. వీధి దీపాలు వెలుగడం లేదనే విషయం ఉన్నతాధికారులకు తెలిసినా కిందిస్థాయి సిబ్బందిని ముందుకు నడిపించడంలో విఫలమవుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజా ప్రతినిధులు బాధ్యతారాహిత్యం వల్ల డివిజన్లో వీధి దీపాల సమస్య నెలల తరబడి కొనసాగుతుందని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధి దీపాల సమస్యను పరిష్కరించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. మరమ్మతులు చేసి సమస్యను పరిష్కరిస్తాం… బస్తీలు, కాలనీల్లో పర్యటించి వీధి దీపాల పరిస్థితిని పరిశీలించి సమస్య ఎక్కడ ఉందో తెలుసుకుని పరిష్కరిస్తాం. ఇప్పటికే తమ తమ దృష్టికి వచ్చిన ప్రాంతాలలో మరమ్మతు లు చేయించి సమస్యను పరిష్కరిస్తున్నాo. పాత వాటికి మరమ్మతులు చేయడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో పాత వాటిని తొలగించి కొత్త దీపాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని జీహెచ్ఎంసీ స్ట్రీట్ లైట్స్ ఏఈ సౌమ్య పేర్కొన్నారు.