మైలార్‌దేవ్‌పల్లి, జూలై 19: మైలార్‌దేవ్‌పల్లి డివిజన్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా తయారైంది. నోర్లు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్, గుంతలమయమైన రోడ్లతో పాటు వీధి దీపాలు వెలగడం లేదు. దీంతో స్థానికులకు తిప్పలు తప్పడం లేదు. ఆషాఢమాసం బోనాల పండుగను సంబురంగా చేసుకోవాలని అందరూ ఆశగా ఎదురుచూస్తుంటే డివిజన్ ప్రజలకు మాత్రం సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
గోతులమయంగా ఉన్న రోడ్లపై పాదచారులు, వాహనాదారులు పడిపోయి ప్రమాదాల బారిన పడుతున్నారు. వెలగని వీధి దీపాల కారణంగా, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్ మూతల్లో పడి ప్రజలు ఆస్పత్రుల పాలవుతున్నారు. అధికారులు సమస్యలపై శ్రద్ధ వహించకపోవడంతో ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారుతుంది. ఈ దుస్థితిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు మెరుగైన సౌకర్యాలు కల్పించకపోవడంతో పండుగలను సైతం ప్రశాంతంగా జరుపుకోలేకపోతున్నామని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలోని బస్తీ ప్రజలు వాపోతున్నారు. బోనాల పండుగ సందర్భంగా మరమ్మతు పనులను నిర్వహించి తాత్కలికంగానైనా సమస్యలు పరిష్కరించాలని కోరినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలపై చిత్తశుద్ధితో వ్యవహరించాలని, సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపించాలని కోరుతున్నారు.