మేడ్చల్, జనవరి7(నమస్తే తెలంగాణ): “అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.. చర్యలు తీసుకోండి మహా ప్రభో!” అంటూ అధికారులకు స్థానికులు, ప్రజలు విన్నవిస్తేనే కదులుతున్నట్టు సంకేతాలు రుజువు చేస్తున్నాయి. వారు విధి విధానాలకు అనుగుణంగా కదలడం లేదని స్థానికులు చెబుతున్నారు. ‘ఎక్కడ ఎవ్వడేం చేస్తే మాకేంటి? మాకు అందాల్సిన మూట.. అందుతుంది’ అన్న ధోరణి అధికారుల్లో ప్రస్పుటంగా అగుపిస్తున్నట్టు మేడ్చల్ జిల్లాలో ఆయా ప్రాంతాలలోని పలువురు చెబుకుంటున్నారు. అక్రమ నిర్మాణాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తే తప్ప అధికారులు చర్యలు తీసుకోకవపోవడం మూలంగా అధికారులపై ప్రజలకు పలు అనుమనాలు ఉద్భవిస్తున్నాయి.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ప్రభుత్వ, వివాదాస్పద భూములలో అనేక అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. జిల్లాలో ఉన్న మేడ్చల్, గుండ్ల పోచంపల్లి, తూకుంట, ఘట్కేసర్, పోచారం, దమ్మాయిగూడ, నాగారం, కొంపల్లి, దుండిగల్ మున్సిపాలిటీలు ఉండగా నిజాంపేట్, జవహర్‌నగర్, బొడుప్పల్, పీర్జాదిగూడ కార్పొరేషన్లు ఉన్నాయి. అయితే, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో అనేకంగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ విషయమై స్థానికులు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. దీంతో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు చేసేందుకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ కమిషనర్లు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే జిల్లా కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదులు చేయాల్సి వస్తుందని తెలుపుతున్నారు. మున్సిపల్ కమిషనర్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడం ఒ కారణంగా కనిపిస్తుంది.
జవహర్‌నగర్‌లో 975 ఎకరాలు కబ్జా..
జవహర్‌నగర్‌లో సుమారు 975 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కబ్జాలకు గురైన భూమి వందల కోట్లలో ఉంటుంది. అయినప్పటికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్లే ప్రభుత్వ భూమి కబ్జాలు చేసి కోట్లాది రూపాయలు దండుకున్నారు. నిరుపేదలు నిర్మించుకున్న వారిపై చర్యలు తీసుకోవడం తప్ప బడాబాబులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి .
అక్రమ నిర్మాణాల కూల్చివేతలు – నమస్తే ఎఫెక్ట్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్‌లోని చెంగిచెర్లలో వివాదాస్పద భూములలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనంపై అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సర్వే నం. 34, 35, 36లలోని వివాదాస్పద భూములలో అక్రమ నిర్మాణాలను రాత్రికి రాత్రే నిర్మాణాలు చేస్తున్నట్లు వచ్చిన కథనంతో అధికారులు స్పందించారు. వివాదాస్పద భూములలో అధికార పార్టీకి చెందిన నేతలు అండ దండలు అందిస్తున్న క్రమంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నమస్తేలో వచ్చిన కథనంతో నిర్మాణాలను కూల్చివేశారు.
బోడుప్పల్లో…
బొడుప్పల్ మున్సిపల్ పరిధిలో రామకృష్ణనగర్‌లో జనావాసల మధ్య కమర్షియల్ షెడ్లకు అనుమతులు లేకున్నా షెడ్లను నిర్మిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు. అనుమతులు లేకున్నా నిర్మిస్తున్న షెడ్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. రెసిడెన్సియల్ జోన్లో నిర్మిస్తున్న కమర్షియల్ షెడ్లను తొలగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కుత్బుల్లాపూర్‌లో అక్రమ నిర్మాణాలు..
కుత్బులాపూర్ 128 డివిజన్ చింతల్ భగత్‌సింగ్ నగర్‌లోని నాలా సమీపంలో సర్వే నం. 155లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినా మున్సిపల్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యహరిస్తున్నారు. ప్రభుత్వ స్థలంలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రభుత్వ భూమిలో ప్రజల ప్రయోజనాలకు అవసరమయ్యే విధంగా చూడాలని భగత్‌సింగ్ నగర్ ప్రజలు జిల్లా కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు.