దుండిగల్, ఏప్రిల్ 6: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అక్రమ నిర్మాణాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఎటు చూసినా అక్రమ కట్టడాలు, అనుమతులు లేని నిర్మాణాలే దర్శనమిస్తున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు పట్టణ ప్రణాళిక విభాగంలో నెలకొన్న అనిచ్ఛితే కారణమంటున్నారు.
నిజాంపేటలో పనిచేసే అసిస్టెంట్ సిటీ ప్లానర్, సెక్షన్ అధికారులు రెగ్యులర్ ఉద్యోగులు కాకపోవడం, వారంలో ఏసీపీ మూడు రోజులు, టీపీఎస్ మరో మూడు రోజులు విధులు హాజరు కావడం అక్రమార్కులకు, కిందిస్థాయి ఉద్యోగులకు కలిసి వస్తుందనే విమర్శలు చెలరేగుతున్నాయి. ఓ వేళ సంబంధిత శాఖాధికారులు విధులకు హాజరైనా తమ పనుల్లో నిమగ్నం అవుతారే తప్ప ప్రజా ప్రయోజనాలపై దృష్టి పెట్టరని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఎంతసేపు తమకు ఏమి మిగులుతుంది.. అనే ధ్యాసే తప్ప అక్రమ నిర్మాణాలతో భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులపై ఎంత మాత్రం ఆలోచన చేయడం లేదని పలువురు వాపోతున్నారు. ఫలితంగా ఇబ్బడి ముబ్బడిగా అనుమతులు లేని, అక్రమ కట్టడాలు నిజాంపేట కార్పొరేషన్లో యథేచ్ఛగా సాగుతున్నాయని దీంతో కార్పొరేషన్‌కు తద్వారా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందన్నారు.
జీ ప్లస్ టుకు అనుమతులు తీసుకొని..
– నిజాంపేట కార్పొరేషన్, బాచుపల్లి పరిధిలోని రేణుకా ఎల్లమ్మ కాలనీలో సుమారు 200 గజాల స్థలంలో ఇంటి నిర్మాణం చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి జీ ప్లస్ టు అంతస్తులకు అనుమతులు తీసుకొని ఏకంగా ఐదంతస్తులు నిర్మించాడు. అంతటితో ఆగకుండా పెంట్‌హౌస్ సైతం నిర్మిస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. పైగా రోడ్డును ఆక్రమించి నిర్మాణం చేపట్టడంతో పాటు షటర్లు వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని, ఎవరైనా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నాడని స్థానికులు వాపోతున్నారు. “ అధికారులకు ఇచ్చేది ఇచ్చేశాం.. ఇక ఎవరూ మమ్మల్ని ఏం చేయలేరు.” అని పలువురిని బెదిరించినట్లు సమాచారం.
అసైన్డ్ భూమిలో ఆరంతస్తులు…
– నిజాంపేటలోని సైదప్ప కాలనీ సమీపంలో ఉన్న సర్వేనెంబర్ 191 ప్రభుత్వ భూమిలో ఏకంగా సుమారు 250 గజాల స్థలంలో భవనం నిర్మిస్తున్నాడు. అయితే ఈ భవనానికి సంబంధించి గతంలోనే జీవో 59 ప్రకారం ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్ చేయించుకుని, జీ ప్లస్ టూ అంతస్తుల కోసం రెండు ఫ్లాట్లకు వేరువేరుగా అనుమతులు తీసుకొని తదనంతరం రెండింటిని క్లబ్ చేసి ఒకే భవనంగా నిర్మిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని స్థానిక సీపీఎం నేత పలుమార్లు టౌన్ ప్లానింగ్, కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినా అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక అవినీతి దాగి ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్టే ఉందని పలువురు పేర్కొంటున్నారు.
మీరు కట్టుకోండి… మేం తర్వాత అనుమతులు ఇస్తాం!
-కాగా నిజాంపేట్ కార్పొరేషన్ పరిధి 30వ డివిజన్లోని సిరివ్యాలి గేటెడ్ కమ్యూనిటీని ఆనుకుని సుమారు అర ఎకరం స్థలంలో ఎటువంటి అనుమతులు లేకుండానే ఒకరు స్విమ్మింగ్ పూల్ నిర్మించడం చర్చనీయాంశంగా మారింది. పేద ప్రజలు చిన్న గూడు నిర్మించుకుంటేనే అనుమతుల పేరుతో కూల్చివేస్తూ నానా హంగామా చేసే అధికారులు.. రెండు నెలలుగా భారీ షెడ్డును నిర్మించడంతోపాటు, ఈత కొలను కోసం భారీగా మట్టి తవ్వుతున్నా అటువైపు చూడకపోవడం ఏంటని అధికారులను ప్రశ్నిస్తున్నారు.
ఇదే విషయమై స్విమ్మింగ్ పూల్ నిర్మాణదారుడు తాము మున్సిపల్ అధికారులను మేనేజ్ చేశామని బాహాటంగానే చెప్పుకోవడంతోపాటు “ముందు మీరు కట్టుకోండి.. తర్వాత మేమే ట్రేడ్ లైసెన్స్ ఇస్తాం” అంటూ భరోసా కల్పించారని చెప్పడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను నిలువరించాల్సిన వారే ప్రోత్సహిస్తే ప్రభుత్వ ఆదాయానికి గండి పడటం ఖాయమని పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. నిజాంపేట మున్సిపాలిటీలోని టౌన్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న అవినీతిపై సీడీఎంఏ అధికారులు దృష్టి సారించి చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. అయితే కిందిస్థాయి సిబ్బంది చేతివాటం కారణంగానే కార్పొరేషన్ పరిధిలో అక్రమ కట్టడాలు, అనుమతి లేని నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయని స్పష్టమవుతున్నాయి.