సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 5: 137 ఏండ్ల చరిత్ర కలిగిన నిజాం కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికేట్ వరించింది. కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్ సర్టిఫికెట్తో పాటు దోస్త్‌లో 97.4 శాతం ప్రవేశాలతో రాష్ట్రంలో అత్యధిక రేటు సాధించడం, 2025 నైరఫ్ ఇండియా ర్యాంకింగ్స్‌లో కాలేజ్ విభాగంలో 101-150 రేంజ్లో నిలిచి తెలంగాణ రాష్ట్రంలో ఏకైక కళాశాలగా ప్రత్యేక గుర్తింపు పొందడం గర్వంగా ఉందని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఏవీ రాజశేఖర్ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కళాశాల విద్యార్థుల విభిన్న రంగాల్లో గొప్ప విజయాలపై ఎంతో గర్వపడుతున్నట్లు ఆయన వివరించారు. మహబూబా బాద్ జిల్లా గ్రామీణ తండాలలో అత్యుత్తమ సామాజిక సేవలను చేసిన విద్యార్థి ఇండియన్ ఐకాన్ అవార్డుతో సత్కారం పొందినట్లు చెప్పారు.
అంతే కాకుండా 254 మంది విద్యార్థులు ప్రముఖ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు సంపాదించడం అకాడమిక్, ప్లేస్మెంట్ కార్యక్రమాల సమర్థతకు నిదర్శనమన్నారు. కళాశాల ఫ్యాకల్టీ అంకిత భావం, మార్గదర్శకత్వం వల్ల హైదరాబాద్ విశ్వవిద్యాలయం, ఐఎస్సీ బెంగళూరు, ముంబైలోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్(టీఐఎఫ్ఆర్) వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో అనేక మంది విద్యార్థులు ప్రవేశం పొందడంతో సాధ్యమైందన్నారు.