ఖైరతాబాద్, డిసెంబర్ 7: రోగుల సేవలకే జీవితాన్ని అంకితం చేసే నర్సింగ్ ఉద్యోగుల బాగోగులను ప్రభుత్వం, యాజమాన్యం విస్మరిస్తున్నట్లు కనిపిస్తున్నది. ప్రతిష్ఠాత్మక నిమ్స్ దవాఖానలో నర్సింగ్ ఉద్యోగుల సేవలు వెలకట్టలేనివి. అత్యాధునిక సేవలకు తోడు, నిమ్స్ ప్రతిష్టను పెంచడంలో నిపుణులైన నర్సింగ్ అధికారులు, సిబ్బంది అంకితభావ సేవలు దోహదంగా నిలుస్తున్నాయి. కానీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో తమ సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారంటూ.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను అనేక సార్లు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. యాజమాన్య తీరును నిరసిస్తూ సమ్మెకు సిద్ధమవుతున్నారు.
నిమ్స్‌లో సుమారు 900 మందికి పైగా నర్సింగ్ సిబ్బంది ఎమర్జెన్సీ, ఐసీయూ, ట్రామాకేర్, ఆపరేషన్ థియేటర్లు తదితర ప్రతి విభాగంలోనూ రోగులకు సేవలందిస్తున్నారు. ఈ సేవలకు సరైన గుర్తింపు, గౌరవం, ప్రోత్సాహం యాజమాన్యం నుంచి అందడం లేదన్న ఆరోపణలున్నాయి. సమస్యలు పరిష్కరించమని యాజమాన్యాన్ని నిలదీస్తే ఓ నర్సింగ్ సిబ్బందిని డీ ప్రమోట్ చేయించారని, తమకు అనుకూలంగా ఉన్న వారితో అకారణంగా అట్రాసిటీ కేసులు సైతం పెట్టించారని ఓ నర్సింగ్ అధికారి ఆవేదనతో చెప్పారు.
వైద్యులతో సమానంగా సేవలందిస్తున్న నర్సింగ్ సిబ్బంది తల్లిదండ్రులకు ఏమైనా జబ్బు చేస్తే నిమ్స్‌లో ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశం లేదని పలువురు నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సౌకర్యం లేకపోవడంతో సొంత తల్లిదండ్రులకు పనిచేస్తున్న దవాఖానలో డబ్బులు కట్టి చికిత్స చేయించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. రోగులకు సేవలందిస్తున్న సమయంలో నర్సులకు మాస్కులు, గ్లౌజులు వంటివి తప్పని సరి, కానీ వాటి వినియోగంపై కూడా ఆంక్షలు పెడుతున్నారని, ఖర్చులు తగ్గించుకోవాలని హుకుం జారీ చేస్తున్నారని నర్సింగ్ అధికారులు వాపోతున్నారు. తమ పర్యవేక్షణలో ఉన్న వెంటిలేటర్లను సైతం ఇతర వార్డులకు తరలిస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. కాగా, ఇటీవల పదవీ విరమణ పొందిన నర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన 135 లీవు ఎన్‌క్యాష్‌మెంట్‌ను తొలగించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
నర్సింగ్ సూపరింటెండెంట్‌కు ప్రత్యేక గదులు, నర్సింగ్ అధికారులకు కనీసం వాషరూమ్లు కూడా లేవని ఆరోపిస్తున్నారు. గతంలో ఏఎన్ఎం సిస్టర్స్‌కు ఇంక్రిమెంట్స్ ఇచ్చే వారు, కానీ ఇటీవల పదవీ విరమణ పొందిన ఓ సిబ్బందికి ఏకంగా రూ.4 లక్షల వరకు కట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. గత డైరెక్టర్లు నర్సింగ్ సేవలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చి వారికి సౌకర్యాలు కల్పించే వారని, ప్రస్తుతం ఆ సౌకర్యాలను ఒక్కొక్కటీగా తొలగిస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.
నిమ్స్ దవాఖానలో పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బంది దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించకపోవడాన్ని నిరసిస్తూ నేటి(సోమవారం) నుంచి సమ్మె కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు నిమ్స్ నర్సెస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎస్. ఆశాలత, టి. కృష్ణలు తెలిపారు. ఈఎల్ ఎన్‌క్యాష్‌మెంట్, క్యాడర్ రివ్యూ, స్టాఫ్ రిక్రూట్మెంట్, గ్రాట్యూటి తదితర సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం విఫలమైందన్నారు. కాన్సాలిడేటెడ్ పే పై పనిచేస్తున్న నర్సింగ్ సిబ్బందిని ఖాళీలు ఉన్నా పర్మినెంట్ చేయడం లేదన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ ఆదేశాల పేరుతో నిరంతరం వార్డులు మారుస్తున్నారని, తమ ఇబ్బందులపై ప్రశ్నిస్తే వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.
ఇప్పటికే తమ సమస్యలపై లేఖ అందించి పది రోజుల్లో జాయింట్ మీటింగ్ పెట్టాలని కోరామని, కానీ పట్టించుకోలేదన్నారు మళ్లీ రిమాండర్ ఇచ్చినా పట్టింపు లేని ధోరణి చూపించారని, ఇక సమ్మె సరైన మార్గంగా భావిస్తున్నామని, నేటి నుంచే తమ కార్యాచరణ మొదలవుతుందన్నారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతామని, 10, 11 తేదీల్లో గంట పాటు నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని, అయినా యాజమాన్యం దిగిరాకుంటే ప్రత్యక్ష సమ్మె చేస్తామని వారు స్పష్టం చేశారు.