ఖైరతాబాద్, మార్చి 22 : వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందడం ద్వారా అనేక రోగాలకు కచ్చితమైన నిర్ధారణ సాధ్యమవుతుందని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అన్నారు. ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు జాతీయ సదస్సు నిమ్స్ ఆడిటోరియంలో ఆదివారం జరిగింది. ఈ సదస్సును ప్రారంభించిన డైరెక్టర్ బీరప్ప మాట్లాడుతూ హైదరాబాద్‌లో మున్ముందు నాలుగు తెలంగాణ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) అందుబాటులోకి రానున్నాయని, తద్వారా 4వేల పడకలు వస్తాయని, నిమ్స్‌లో అదనంగా 2వేలు, ఉస్మానియా, కాకతీయ వైద్యశాలల్లో మరో 3వేల పడకలు పెరుగుతాయని తెలిపారు.
అనంతరం సదస్సులో ప్రొఫెసర్ కాకర్ల సుబ్బారావు జీవన సాఫల్య పురస్కారాన్ని నిమ్స్ వైద్య అనుబంధ వృత్తి విజ్ఞాన కళాశాల ప్రిన్పిపల్ శీరందాస్ శ్రీనివాస్‌కు అతిథులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్. రామ్మూర్తి, కాకర్ల సుబ్బారావు రేడియాలజీ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ ఎన్. కవితా రెడ్డి, సొసైటీ ఆఫ్ ఇండియన్ రేడియోగ్రాఫర్స్ చైర్మన్ కె. మునిరత్నం, అకాడమిక్ చైర్మన్ కె. దామోదర నాయుడు, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంఎ వారిస్, ప్రోగ్రాం కోఆర్డినేటర్ మహేశ్ బసనేని తదితరులు పాల్గొన్నారు.