ఖైరతాబాద్, జూన్ 23 : నిత్యం రోగులకు అందుబాటులో ఉంటూ వారికి సపరియాలు చేస్తూ…సేవలందించే నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికుడు (వార్డు బాయ్) ఓ రోగి ప్రాణాలను కాపాడాడు. కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలం, పెద్దనుక్కలపేట గ్రామానికి చెందిన బగ్గీ అశోక్ భార్య లక్ష్మితో కలిసి జనరల్ మెడిసిన్ విభాగంలో వైద్య పరీక్షల కోసం పాత ఔట్ పేషెంట్ బ్లాక్‌కు వచ్చారు. అశోక్‌కు అకస్మాత్తుగా గుండె నొప్పి రావడంతో కుప్పకూలిపోయాడు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న వార్డు బాయ్ శ్రీనివాస్ వైద్యుల కోసం ఎదురుచూడకుండా సీపీఆర్ చేసి ట్రాలీలో అక్యూట్ మెడికల్ కేర్ యూనిట్‌కు తీసుకెళ్లి అడ్మిట్ చేశాడు. తక్షణమే వైద్యులు అతనికి ఆక్సిజన్ అందించి చికిత్స చేయడంతో ప్రాణాలు దక్కింది. శ్రీనివాస్ సకాలంలో సీపీఆర్ చేయడం వల్లే రోగి ప్రాణాలు నిలబడ్డాయని వైద్యులు తెలిపారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి రోగి ప్రాణాలను కాపాడిన శ్రీనివాస్‌ను డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప, వైద్యులు అభినందించారు. ప్రస్తుతం అశోక్ కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. అశోక్ ప్రాణాలను రక్షించిన శ్రీనివాస్‌కు భార్య లక్ష్మి, బంధువులు, కృతజ్ఞతలు తెలిపారు.