సిటీబ్యూరో,జూన్6(నమస్తే తెలంగాణ):రాజేంద్రనగర్ ఠాణాలో అనుమానాస్పదంగా మృతి చెందిన ఆటోడ్రైవర్ ఇర్ఫాన్ మృతి చెందిన ఘటనను జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సుమోటోగా స్వీకరించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి వారం రోజుల్లో నివేదిక సమర్పించాలంటూ పోలీసులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఆటోడ్రైవర్ అనుమానాస్పద మృతి ఘటన మరోసారి తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళితే…కర్ణాటకలోని మైసూర్ ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ (35) బండ్లగూడ జాగిర్‌లోని ఖలీజ్‌ఖాన్ ప్రాంతంలో నివసిస్తూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, పొరుగింటి వివాహిత మహిళతో పరిచయం పెంచుకుని సన్నిహితంగా మెలుగుతున్నాడు.
దీంతో ఇర్ఫాన్ అతడి భార్య నిషాదల మధ్య తలెత్తిన వివాదం కాస్త ఆరు కుటుంబాలకు చేరడంతో మే 13న రాత్రి నిషాద కుటుంబసభ్యులు ఇర్ఫాన్‌ను నిలదీశారు. దీంతో ఇరు కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగగా, అదేరోజు రాత్రి వారు రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఇర్ఫాన్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం ఇరు వర్గాల వారు రాజీ కుదుర్చుకొని అంగీకార పత్రం రాసుకున్నారు. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన ఇర్ఫాన్ ఒక్కసారిగా ఠాణా ఆవరణలోనే కుప్పకూలిపోయాడు.
గమనించిన కుటుంబసభ్యులు వెంటనే బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రైవేటు దవాఖానకు తరలించగా.. ఉస్మానియాకు తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. దీంతో బాధితుడిని ఉస్మానియాకు తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అయితే ఇర్ఫాన్‌ను పోలీసులు కొట్టడంతోనే మృతి చెందాడని అతడి కుటుంబసభ్యులు ఆరోపించారు. ఇర్ఫాన్ పెట్టిన కేకలు పోలీస్‌స్టేషన్ బయట రోడ్డు వరకు వినిపించాయని, పోలీసుల దెబ్బలకు ఇర్ఫాన్ బయటకు పరిగెత్తుకొచ్చి రెండుసార్లు వాంతులు చేసుకున్నాడని, మృతుడి సోదరుడు ఘటన జరిగిన మరుసటిరోజు మీడియాకు వెల్లడించాడు.
పోలీస్‌స్టేషన్‌లోనే కుప్పకూలినా పోలీసులు స్పందించలేదని, హాస్పిటల్‌కు కూడా తీసుకెళ్లలేదని ఆరోపించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఆరోపణలపై మీడియాలో వచ్చిన కథనాలను జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి వారం రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ పోలీసులకు నోటీసులు జారీచేసింది. అయితే పోలీసులు మాత్రం తమకు ఎలాంటి నోటీసులు అందలేని చెప్పడం గమనార్హం.