సిటీబ్యూరో, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023కి గుడ్‌బాయ్ చెప్పి 2024ను ఆహ్వానించబోతున్నాం. ఈ ఏడాది ముగియడంలో ‘డిసెంబర్ 31’కి ఉండే క్రేజే వేరు. ప్రతి ఒక్కరూ ఆ రోజు ఆనంద డోలికల్లో మునిగితేలాలని ఊవిళ్లూరుతారు. కొత్త కొత్త ఆశలతో మధురానుభూతులను అందించాలని కోరుకుంటూ కొత్త ఏడాదికి నగరవాసులు స్వాగతం పలకాలని కోరుకుంటారు. వీరి ఆనందానికి ఏ మాత్రం డోకా లేకుండా అంతకు మించి అన్నట్టుగా నగరంలోని హోటళ్లు, రిసార్టులు, పబ్‌లు నయా జోష్‌కు సిద్ధమయ్యాయి. మిరుమిట్లు గొలిపే ఈవెంట్లు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించారు. ప్రముఖ మ్యూజిక్ బ్యాండ్లతో నగరానికి చెందిన డీజేలతో పార్టీలను హీటెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాదు ఒకరికి ఒకరూ పోటీ అన్నట్టుగా ప్రముఖ సినీ తారల డేట్స్ బుక్ చేసి ఈవెంట్స్‌లో అలరించేల ఏర్పాట్లు చేస్తున్నారు. సరికొత్త ప్యాకేజీలతో ప్రత్యేక రాయితీలతో పార్టీలు నిర్వహించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు.
పార్టీకి వేదికలెన్నో..!
నగరంలో కొత్త ఏడాది పార్టీకి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు నిర్వాహకులు. విభిన్న ప్రాంతాల్లో వినూత్న థీమ్‌తో పార్టీలను ఈవెంట్ ఆర్గనైజర్లు ప్లాన్ చేశారు. ఇప్పటికే ఆసక్తిగల వారు తమకు నచ్చిన ప్యాకేజీలను ఎంపిక చేసుకుటున్నారు. రూ.2 వేల నుంచి ఆపై ధరలు ఉన్నాయి. అధికంగా అన్లిమిటెడ్ ఫుడ్, లిక్కర్ అందిస్తున్న ప్యాకేజీలకు అధికంగా డిమాండ్ వస్తుంది. కంట్రీ క్లబ్ ఆధ్వర్యంలో వార్ ఆఫ్ ది డీజే థీమ్‌తో రసూల్‌పురాలోని పోలీస్ హాకీ స్టేడియంలో సాయంత్రం 7 నుంచి వేడకలు జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ తారలు, డీజే ఎక్స్పర్ట్స్ పాల్గొంటారు. కొంపల్లిలోని 10 డౌనింగ్ స్ట్రీట్‌లో న్యూ ఇయర్ ఈవ్ బాష్ వేడుకకు నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రిసం సర్కస్‌లో లైట్స్, సౌండ్స్, లేసర్ ఫైర్ వర్క్స్, మ్యాజిక్ ఆఫ్ ఎస్ఎఫ్ఎక్స్, అన్లిమిటెడ్ లిక్కర్, ఫుడ్‌తో అదిరిపోయేల కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు సిద్ధంచేశారు. సావిఫార్మ్స్లో ఓపెన్ డీజే డ్యాన్స్, ఫుల్ పార్టీ, మాస్క్ థీమ్డ్ పార్టీతో వేడుకలు జరగనున్నాయి. దీనికి ప్రముఖ డీజే జైన్ సబ్రి, నవాబ్స్ పాల్గొంటారు. చిరాన్ ఫోర్ట్ ఆధ్వర్యంలో న్యూ ఇయర్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. శాఫ్రాన్ వాల్యూలో స్టార్ నైట్ పేరుతో అన్లిమిటెడ్ ఫుడ్, లిక్కర్, లియా లిస్సే, డీజే పండు మాస్టర్, జాయ్-ఎస్ సందడి చేయనున్నారు. హైటెక్ ఎగ్జిబిషన్ సెంటర్లో మ్యుజిషియన్ కాప్రిసియో, డీజే పృథ్వి సాయి అలరించనున్నారు.