సిటీబ్యూరో, ఆగస్ట్ 25(నమస్తే తెలంగాణ): నగరంలోని సికింద్రాబాద్ నాగార్జున నగర్‌కు చెందిన ఒక వినియోగదారుడు జూన్ నెలలో తనకు కొత్త ట్రాన్స్ఫార్మర్ కనెక్షన్ ఇవ్వాలంటూ డిస్కంకు రూ.2.61లక్షలు చెల్లించారు. అప్పటికే తన ఇంట్లో డీటీఆర్ ఏర్పాటుకు సంబంధించిన నిర్మాణం అంతా పూర్తి చేసి లైన్లను కూడా కనెక్ట్ చేసి పెట్టుకున్నారు. రెండున్నరనెలలు దాటినా ఇప్పటివరకు పోల్‌పై కనెక్షన్ ఇవ్వడానికి డిస్కం నుంచి ఎల్సీ ఇవ్వకపోవడంతో ఆ పని పెండింగ్‌లోనే ఉంది.
సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన ఓ వినియోగదారుడు తన ఇంట్లో సర్వీస్‌లైన్ చార్జెస్ 3.11లక్షలు, డీటీఆర్‌కు 1.70లక్షలు ఇలా అన్ని చార్జీలు కలిపి రూ.4.99లక్షలు జూలైలో చెల్లించాడు. తన ఇంట్లో నిర్మాణానికి సంబంధించిన ఏర్పాటు కూడా చేసుకున్నాడు. లైన్‌మెన్‌తో పాటు ఎవరిని అడిగినా పై అధికారుల నుంచి అనుమతి రాలేదంటూ ఎల్సీ ఇవ్వకుండా పని ముందుకు జరగకుండా నెలరోజులుగా దాటేస్తున్నారు. ఈ విషయంలో స్థానిక అధికారులను అడిగితే మెయిన్ కార్యాలయం నుంచి ఎల్సీలు రద్దు చేశామంటూ మళ్లీ ఎల్సీ ఇచ్చినప్పుడే కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో డబ్బులు కట్టించుకుని ఈ వ్యవహారం ఏంటంటూ వినియోగదారుడు మండిపడుతున్నారు.
ఇలా నగరంలో దాదాపుగా కొత్త కనెక్షన్లకు సంబంధించి ఎస్పీడీసీఎల్ తీసుకుంటున్న నిర్ణయాలు చాలావరకు వివాదాస్పదమవుతున్నాయి. కనెక్షన్లకు సంబంధించిన ఎస్టిమేషన్లు వేసి, డబ్బులు కట్టించుకుని కనెక్షన్లు ఇవ్వడంలో మాత్రం డిస్కం సిబ్బంది తమ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. అన్ని సర్కిళ్ల పరిధిలో ఇదే పరిస్థితి కొనసాగుతుండడంతో లక్షల రూపాయలు కనెక్షన్ కోసం కట్టి తామేం చేయాలో తెలియక వినియోగదారులు సర్కిల్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు గణపతి నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో మండప నిర్వాహకులకు విద్యుత్ వినియోగంపై సూచనలు చేస్తున్న దక్షిణ డిస్కం కనెక్షన్ల కోసం తమను సంప్రదించాలని చెబుతున్నా.. అడుగడుగునా ఎల్సీలు ఎలా అమలు చేస్తుందని కాంట్రాక్టర్లు అడుగుతున్నారు.
గ్రేటర్ పరిధిలోని పది సర్కిళ్లలో లక్షల రూపాయలు కొత్త సర్వీస్ కోసం డీటీఆర్‌ల కోసం కట్టి వినియోగదారులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. ముందు ఎస్టిమేషన్ సమయంలోనే ఆలస్యమవుతుందని చెప్పకుండా శాంక్షన్ ఇచ్చి తీరా డబ్బులు కట్టిన తర్వాత ఎల్సీలు ఇవ్వకపోవడంతో ఒక్కొక్కరు రెండునెలలుగా డిస్కం చుట్టూ తిరుగుతున్నారు. అయితే పైనుంచి అధికారులు చెబితే తప్ప తాము ఎల్సీ ఇవ్వలేమని చెప్పడంతో పనులన్నీ పెండింగ్‌లో పడుతున్నాయి.
20కిలోవాట్స్ దాటితే తప్పనిసరిగా ట్రాన్స్ఫార్మర్ పెట్టుకోవాలన్న నిబంధనతో అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి శాంక్షన్ ఇచ్చిన తర్వాత డబ్బులు కట్టించుకున్న విద్యుత్ అధికారులు పనుల దగ్గరకు వచ్చేసరికి చేతులు ఎత్తేస్తున్నారు. కొత్త కొత్త రూల్స్‌తో వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ ఎల్సీల పరంగా కేవలం డిస్కం అధికారులకు అనుకూలమైన వారికే అవకాశం కల్పిస్తున్నారన్న విమర్శలు కూడా ఉన్నాయి. ప్రత్యేకించి కొన్ని సర్కిళ్లలో గంట గంటన్నర పాటు తీసేసి పనులు కాగానే మళ్లీ కరెంట్ ఇస్తున్నారని, అది కేవలం తమ ఫార్మాలిటీస్ పూర్తయితేనే పనిచేస్తున్నారని కొందరు వినియోగదారులు చెప్పారు.
నగరంలో విద్యుత్ శాఖ పలు ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు నిర్వహణ కోసం ఎల్సీలు ఇస్తుంది. ప్రతి సర్కిల్లో ఒక నిర్ణీత సమయంలో ఆ వారంలో కొన్ని గంటల పాటు మెయింటెనెన్స్ కోసం కేటాయిస్తుంది. అయితే ఎల్సీలు ఇవ్వడంతో కరెంట్ పోతుందంటూ వినియోగదారులు ఫిర్యాదు చేస్తున్నారన్న సాకుతో ఎల్సీలు బంద్ చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని, దీంతో నగరంలో ఎల్సీలు బంద్ చేస్తున్నట్లు దక్షిణ డిస్కం ప్రకటించింది. అయితే ఎల్సీలు ఇవ్వకపోతే నగరంలో విద్యుత్ మెయింటెనెన్స్ పూర్తిగా కుంటుపడుతుంది.
కానీ విద్యుత్ శాఖ ప్రతిసారి ఎల్సీల పేరుతో ప్రకటించిన సమయం కంటే ఎక్కువ సమయం కరెంట్ కట్ చేయడం, అప్రకటిత విద్యుత్ కోతల కారణంగా వినియోగదారులు మండిపడ్డారు. దీంతో ప్రభుత్వం ఎల్సీలు బంద్ చేయాలని చెప్పింది. అయితే గతంలో ఒక్కో ఏరియాలో ఎల్సీల కోసం నిర్ణీత సమయం పెట్టేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ఇదిలా ఉంటే గణపతి నవరాత్రుల సమయంలో విద్యుత్ వినియోగం అధికంగా జరగడమే కాకుండా వాడవాడలా మండపాలు వెలుస్తాయి. వీటికి ఇచ్చే కనెక్షన్ల విషయంలో ఎల్సీ అవసరం ఉంటుంది. మరి ఈ విషయంలో విద్యుత్‌శాఖ నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలని వినియోగదారులు చెబుతున్నారు.