2021వ యేడాదికి ముగింపు పలికి.. 2022వ యేడాదికి స్వాగతం పలికింది భాగ్యనగరం. ఆట, పాటలతో కలర్‌ఫుల్ ఈవెంట్స్ జరుపుకుని సందడిగా కొత్త ఏడాదిలోకి నగరవాసులు కాలుమోపారు. శుక్రవారం సాయంత్రం నుంచి అర్థరాత్రి
12 వరకు నగరం సెలబ్రేషన్స్‌తో మార్మోగింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు నయాసాల్ జోష్‌లో పాలుపంచుకున్నారు. కుటుంబ సమేతంగా సందడిగా గడిపారు. కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండుగలా 2022వ యేడాదిని ఆహ్వానించారు. నగరంలోని పబ్‌లు, రెస్టారెంట్స్, హోటళ్లలో కుర్రకారు చిందేసి మజా చేశారు. స్టెప్పులతో ధూంధాంగా గడిపారు. నగరంలోని నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, చార్మినార్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, మణికొండ, హైటెక్ సిటీ, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్నంటాయి. టపాసులు కాల్చుతూ హ్యాపీ న్యూ ఇయర్ అంటూ కొత్త సంవత్సర ఆనందంలో మునిగితేలారు.
ఎక్కడికక్కడ..!!
కరోనా, ఒమిక్రాన్ వెంటాడుతున్న తరుణంలో ఈ ఏడాది సెలబ్రేషన్స్‌కు పరిమిత ఆంక్షలతో అనుమతినివ్వడంతో జాగ్రత్తలు పాటిస్తూ నగరవాసులు సంబురాలు జరుపుకున్నారు. కాలనీ అసోసియేషన్లు, అపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఫ్యామిలీ పార్టీలు చేసుకుని సందడిగా గడిపారు. సోషల్ మీడియాలో న్యూ ఇయర్ పోస్టులు హోరెత్తాయి. డీపీలుగా 2022ను అమర్చి శుభాకాంక్షలు పంచుకున్నారు. కేక్‌లు కట్ చేసిన వీడియోలను వైరల్ చేశారు. కొత్త ఏడాది-డెస్టినేషన్స్‌తో నిర్వర్తించబోయే తమ ప్రణాళికలను తయారు చేసుకున్నట్టు నెటిజన్లు పోస్టులు పెట్టారు. మరోవైపు విభిన్న రకాల కేక్‌లు అనేక ఆకృతుల్లో అలరించాయి. కొంత మంది తమ ఫొటోలతో కేక్‌లను తయారు చేయించుకుంటే, మరి కొందరు తమకు నచ్చిన ఫ్లవర్స్ డిజైన్‌లో రూపొందించుకున్నారు. అక్షరాలు, నెంబర్లు ఇలా కేక్‌లను అందంగా డిజైన్ చేశారు.
అర్ధరాత్రి వరకు ఫుడ్..!!
నగరంలోని బిర్యానీ సెంటర్లు, బేకరీలు, ఐస్‌క్రీం పార్లర్స్, కేక్ దుకాణాలు కస్టమర్లతో కళకళలాడాయి. న్యూ ఇయర్ పేరుతో కొత్తకొత్త ఫ్లేవర్స్‌ను కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చాయి. కొన్ని బిర్యానీ సెంటర్లు కొత్త ఏడాది కానుక అంటూ తగ్గింపు ధరలను ప్రకటించి కస్టమర్లను ఆకట్టుకున్నాయి. అర్ధరాత్రి ఒంటి గంట వరకు హోటళ్ల ముందు కస్టమర్లు బారులు తీరారు. దీంతో పాటు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ రెట్టింపు స్థాయిలో జరిగిందంటూ డెలివరీ బాయ్స్ తెలిపారు. నచ్చిన ఆహారం తెప్పించుకుని ఇంటి వద్దనే ఆరగించి సంబురాలు చేసుకున్నారు. నగరంలోని పలు షాపింగ్ మాల్స్ శుక్రవారం సందడిని తలపించాయి. పలువురు నచ్చిన దుస్తులు, జువెల్లరీ కొనుగోలు చేసి షాపింగ్ ముచ్చట తీర్చుకున్నారు.
ముగ్గులతో ఆహ్వానం..
అర్ధరాత్రి నుంచే యువతులు, మహిళలు ఇండ్లు, ఆపార్ట్మెంట్ల ముందర ముగ్గులు వేయడానికి పోటీపడ్డారు. తీరొక్క రంగులద్దుతూ ఆకట్టుకునేలా ముగ్గులు వేశారు. కొత్త ఏడాదికి స్వాగతం అంటూ ముగ్గులతో ఆహ్వానించారు. తెల్లవారు జాము వరకు కాలనీలలో మహిళలంతా తమ తమ ఇండ్ల ముందర ముగ్గులు వేసుకున్నారు. నగరమంతా పండుగ వాతావరణం తలపించింది.