సిటీ బ్యూరో, జనవరి 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నేషనల్ గ్రీన్ కార్ప్స్కు కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ఆశీర్వాదంతో నూతన డైరెక్టర్‌గా నియామకమైన అధికారి ఆ సీట్లో కూర్చునేందుకు వెనకాడుతున్నారు. ఆయన కన్నా పదిమందికి పైగా సీనియర్ అధికారులు ఉన్నా మంత్రి మాజీ ఓఎస్డీ సహాయ సహకారాలతో పదవిని తెచ్చుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్‌గా సీనియర్ సోషల్ సైంటిస్ట్ గా కొనసాగుతున్నా.. బదిలీ భయంతో ఆయన ఆ స్థానంలో కూర్చుని పీసీబీలోనే పాతుకుపోవాలని భావించారు.
సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం, నిబంధనలకు విరుద్ధంగా మంత్రి మాజీ ఓఎస్డీ సహకారం ఉందనే విషయం బయటపడింది. దీంతో నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్ మార్పు అంశం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలితో పాటు సచివాలయంలో తీవ్ర వివాదాస్పదమైంది. ఎన్జీసీ డైరెక్టర్ మార్పు అంశంపై నిజాలను బట్టబయలు చేస్తూ ‘నమస్తే తెలంగాణ’ వరుస కథనాలు ప్రచురించింది. కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు పర్యావరణ మంత్రిత్వ శాఖ, కాలుష్య నియంత్రణ మండలిలో ప్రకంపనలు సృష్టించింది.
కాలుష్య నియంత్రణ మండలి నుంచి మంత్రి మాజీ ఓఎస్డీని తొలగించినప్పటికీ అంతర్గతంగా ఆయన ఇంకా చక్రం తిప్పుతున్నారనే వాస్తవం బయటపడింది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి కేంద్ర కార్యాలయం నుంచి కదలకుండా ఉండాలనుకుని తెచ్చుకున్న ఎన్జీసీ డైరెక్టర్ పదవీ బాధ్యతలు తీసుకోవడంలో సంబంధిత అధికారి వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తున్నది. వివాదాల నడుమ డైరెక్టర్ పదవి తనకొద్దని బహిరంగంగానే తేల్చిచెప్తున్నట్లు సమాచారం.
డైరెక్టర్ బాధ్యతలపై ఆయోమయం
నేషనల్ గ్రీన్ కార్ప్స్ డైరెక్టర్‌ను మారుస్తున్నట్లు పర్యావరణ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుంచి ఈనెల 1న ఆదేశాలు అందాయి. ప్రస్తుత డైరెక్టర్ స్థానంలో మరో సీనియర్ అధికారిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. కాలుష్య నియంత్రణ మండలి నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపకున్నా, మెంబర్ సెక్రెటరీకి ఎలాంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా డైరెక్టర్ మార్పు ఆదేశాలు రావడంతో అధికారులంతా షాక్ అయ్యారు. మెంబర్ సెక్రెటరీకి కూడా తెలియకుండా తెరవెనుక పెద్ద ఎత్తున లాబీయింగ్ జరిగినట్లు అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈనేపథ్యంలో నూతనంగా బాధ్యతలు అప్పగించే అధికారి కంటే జేసీఈఎస్తో పాటు మరో పదిమంది అధికారులు సీనియారిటీని కలిగి ఉన్నారు. వారందరినీ కాదని ఆదేశాలు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు అందుకున్న అధికారి 25 ఏండ్లుగా పీసీబీ కేంద్ర కార్యాలయంలోనే పాతుకుపోయారు. ఆ స్థానం నుంచి కదలడం ఇష్టం లేకనే ప్రభుత్వ పెద్దలు, మంత్రి మాజీ ఓఎస్డీ ద్వారా పదవిని తెచ్చుకున్నారనే చర్చ చక్కర్లు కొట్టింది. ఈ తతంగమంతా నమస్తే తెలంగాణలో వరస కథనాల రూపంలో ప్రచురితం కావడంతో వివాదం తీవ్రరూపం దాల్చింది. మెంబర్ సెక్రెటరీ సహా సీఎంవో నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైనట్లు సమాచారం. దీంతో చేసేదేమీ లేక ఆ అధికారి ఎన్జీసీ డైరెక్టర్ బాధ్యతలు తనకొద్దని చెప్పడంతో పాత అధికారి ఆ స్థానంలో కొనసాగుతున్నారు. మరి ప్రభుత్వ ఆదేశాలు వెనక్కి తీసుకుంటారా? లేదా? అనే చర్చ ఇప్పుడు పీసీబీలో జోరుగా సాగుతున్నది.