Cyber Crime | సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు కొత్త పంథాలో మోసాలకు తెరలేపుతూ ఆన్లైన్ వ్యాపారులను బెంబేలెత్తిస్తున్నారు. బాధితుల వద్ద కొట్టేసిన సొమ్మును ఈ-కామర్స్, ట్రావెల్ ఏజెంట్ల సైట్లకు మళ్లించి తమకు కావాల్సిన వస్తువులు, ైప్లెట్ టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు. బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ము ఏ ఖాతా నుంచి ఏ ఖాతాలోకి బదిలీ అయ్యిందనే విషయంపై పోలీసులు దర్యాప్తు జరిపినప్పుడు డిస్టినేషన్ ఖాతా రెగ్యులర్‌గా వ్యాపారం చేసే వారిదై ఉంటుంది. సైబర్ నేరగాళ్లకు చెందిన ప్రధాన బ్యాంకు ఖాతాలకు ఆయా వ్యాపారులకు సంబంధించిన ఖాతాకు లింక్ ఉండటంతో రెండు, మూడు, నాలుగు లేయర్లలో ఉండే వ్యాపారుల ఖాతాలు కూడా ఫ్రీజ్ అవుతున్నాయి. ఇలా సైబర్‌నేరగాళ్లు ఆన్లైన్ వ్యాపారులను కూడా హాడలెత్తిస్తున్నారు. పోలీసులు బ్యాంకు ఖాతాలు లింక్ ఉండటంతో మేం ఫ్రీజ్ చేశామని, అది దొంగ సొత్తు అని, మీ ఖాతాకు నేరానికి సంబంధించిన సొమ్ము ఉన్నంత వరకు మీరు బాధ్యులే అవుతారని చెబుతున్నారు. దీంతో కొందరు వ్యాపారులు తమకు తెలియకుండా జరిగిందని, ఎంత సొమ్ము మా ఖాతాలో పడిందో ఆ సొమ్మును బాధితుడికి ఇచ్చేస్తామని, మా ఖాతాలు డ్రీఫీజ్ చేయాలంటూ పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఘటనలు ఉంటున్నాయి.
ఆన్లైన్ సైట్లే కీలకం…!
ఈ-కామర్స్, ట్రావెల్ ఏజెన్సీ తదితర ఆన్లైన్ వ్యాపారాలు నిర్వహించే సైట్లను సైబర్‌నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. వివిధ సైబర్ నేరాలలో బాధితులు డబ్బులు సైబర్‌నేరగాళ్లు సూచించే బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయడం ఆయా ఖాతాలకు నగదు బదిలీ చేయడం చేస్తుంటారు. ఇలా మొదటి ఖాతాలో పడే సొమ్మును విభజిస్తూ ఇతర ఖాతాల్లోకి బదిలీ చేస్తుంటారు. ఇలా బదిలీ చేసే క్రమంలో తమ టీమ్‌లకు అవసరమైన బల్క్ ఫ్లైట్ టిక్కెట్లు, ఈ -కామర్స్‌లో హోల్‌సేల్‌గా కొనుగోలు చేసే సమయంలో లక్షల్లో చెల్లింపులు ఉండటంతో ఆయా నేరఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. అయితే ఈ-కామర్స్ వ్యాపారులకు అది దొంగ సొమ్మా? కదా అనే విషయంపై పట్టింపు ఉండదు. తమ ఖాతాకు నగదు బదిలీ అయ్యిందా అంతే దానికి ప్రతిఫలంగా వస్తువు డెలివరీ చేయాలని తమ పనిలో నిమగ్నమవుతారు. ఇక్కడే కొన్ని సెక్యూరిటీ చెక్స్ పెట్టుకోవడంతో సైబర్‌నేరగాళ్ల ఖాతాతో లింకున్న అనుమానిత బ్యాంకు ఖాతాలను గుర్తించేందుకు వీలుంటుంది.
ఈ-కామర్స్ వెబ్సైట్లకు ఛాలెంజ్
సైబర్ నేరగాళ్లు ఈ-కామర్స్, ట్రావెల్ ఏజెన్సీ వెబ్సైట్లకు ఛాలెంజ్ విసురుతున్నారు. అంతా ఆన్లైన్లోనే లావాదేవీలు జరుగుతున్న క్రమంలో కొనేవాడు ఉపయోగించిన బ్యాంకు ఖాతా నిజమైందా? దొంగదా? అని గుర్తించడం కష్టంగానే మారుతున్నది. దీంతో ఆన్లైన్ కొనుగోలు వ్యవహారాలలో మరింత సెక్యూరిటీని, ఖాతాదారుల నిర్ధారణకు సంబంధించిన ఆప్షన్స్ ఆయా సంస్థలు ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుందని సైబర్‌నిపుణులు పేర్కొంటున్నారు. సైబర్‌నేరగాళ్లు ఉచ్చులో చిక్కి ఇటు సామాన్యులు బాధితులవుతుండగా, అదే విధంగా వ్యాపారులు సైతం కొన్ని సందర్భాల్లో బాధితులుగా మారుతున్నారు.