ముషీరాబాద్, ఫిబ్రవరి 12: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 20వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు జేవీ చలపతిరావు, సాధినేని వెంకటేశ్వరరావు తెలిపారు. బుధవారం విద్యానగర్లోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో చలో హైదరాబాద్కు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ఇచ్చిందన్నారు. ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని, పథకాల అమలులో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు.
రైతులకు ఇస్తానన్న రూ.12 వేలు మరిచిపోయిందని, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినా బస్సులను తగ్గించి తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందన్నారు. వృద్ధులు, వికలాంగులకు ఇస్తానన్న పెన్షన్ గాలికి వదిలేసిందని ఆరోపించారు. ఫిబ్రవరి 20న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించి వేలాది మందితో బహిరంగ సభ నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డెమోక్రసీ నాయకులు కె.గోవర్ధన్ జి.ఝాన్సీ, అరుణ, అనురాధ, మహేశ్, నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు.