Elevator Corridor | సిటీబ్యూరో, ఏప్రిల్ 13(నమస్తే తెలంగాణ): నార్త్ సిటీ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టుకు భూములు ఇవ్వాలంటే తమ షరతులు అంగీకరించాల్సిందేనని రక్షణ శాఖ చెబుతోంది. జేబీఎస్ నుంచి శామీర్పేట్, ప్యారడైజ్ నుంచి డెయిరీ ఫాం మార్గాలలో దాదాపు 18 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టును చేపట్టేందుకు హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో రక్షణ శాఖ భూములతోపాటు, ప్రైవేటు ఆస్తుల సేకరణకు చర్యలు చేపట్టింది.
భూసేకరణ బాధ్యతలను మేడ్చల్, హైదరాబాద్ జిల్లా యంత్రాంగానికి అప్పగించింది. అయితే ఇటీవల భూముల బదలాయింపునకు తీసుకోవాల్సిన చర్యలపై హెచ్ఎండీఏ, రక్షణ శాఖల మధ్య జరిగిన సమావేశంలో… రక్షణ శాఖ అధికారులు పలు షరతులను ప్రతిపాదించినట్లుగా తెలిసింది. వాటికి హెచ్ఎండీఏ ఆమోదిస్తే గానీ, భూముల బదలాయింపు ప్రక్రియను చేపట్టేది లేదని తెలిసింది. ఇందులో ప్రధానంగా రక్షణ శాఖ కోల్పోతున్న ఆస్తులకు సమానంగా భూములు ఇవ్వడంతోపాటు, కూల్చివేసే నిర్మాణాలను కూడా కట్టి ఇవ్వాల్సిందేనంటూ షరతులు పెట్టినట్లుగా వెల్లడైంది.
ఈ క్రమంలో ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. రక్షణ శాఖ సూత్రప్రాయంగా తొలుత భూములు ఇచ్చేందుకు అంగీకరించింది. కానీ ఆ తర్వాత భూముల బదలాయింపునకు పెడుతున్న కొర్రీలతో కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికే కోల్పోతున్న భూమికి పరిహారంగా ఒకేచోట అంతకు సమాన విలువైన భూమిని అందించాలనే నిబంధనతోనే ఇప్పటికీ భూసేకరణ ముందుకు సాగలేదు. తాజాగా ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చేందుకు రక్షణశాఖ అధికారులు పెడుతున్న షరతులు ప్రాజెక్టు పురోగతిని మరింత సందిగ్ధంలో పడవేసినట్లు తెలస్తోంది.
రక్షణ శాఖ విధించిన షరతులు..!
భూముల బదలాయింపునకు రక్షణ శాఖ విధించిన షరతుల్లో ప్రధానంగా జేబీఎస్ నుంచి శామీర్పేట్ మార్గంలో రక్షణ శాఖకు చెందిన రెండు భారీ రిజర్వాయర్లు, మరికొన్ని కట్టడాలు, భవంతులు కోల్పోతున్నట్లుగా తెలిసింది. వీటికి పరిహారంతోపాటు, అదే తరహాలో వేరేచోట వాటిని నిర్మించాలనే ప్రతిపాదన తెరమీదకు వచ్చినట్లుగా తెలిసింది. పరిహారంతోపాటు, తాజా ప్రతిపాదనలకు అంగీకరిస్తేనే ప్రాజెక్టు కోసం అవసరమైన 110 ఎకరాలకు పైగా భూమిని ఇవ్వాలనే రక్షణ శాఖ ప్రతిపాదనతో ఇప్పుడు హెచ్ఎండీఏ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
వెడల్సు తగ్గించాలంటున్న స్థానికులు
ఇప్పటికే ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఆస్తుల సేకరణ వ్యవహారం కోర్టుల్లో చిక్కుకుని ముందుకు సాగడం లేదు. ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసి 4 నెలలు గడుస్తున్నా… 50శాతం కూడా ఆస్తుల సేకరణ పూర్తికాని పరిస్థితి ఉంది. ఇక ప్రాజెక్టు వెడల్పును 200 ఫీట్ల నుంచి 100-150 ఫీట్లకు తగ్గించాలని, మార్కెట్ రేటు ఆధారంగా పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని ప్రైవేట్ వ్యక్తులు తేల్చి చెప్పడం ప్రభుత్వానికి కొత్త సమస్యగా మారింది.