సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): కొత్త పేర్లు చెబితే ఎవరు నమ్మరు.. దీంతో మల్టీనేషనల్ సంస్థల పేర్లు చెప్పి సైబర్‌నేరగాళ్లు అమాయకులకు బురిడీ కొట్టిస్తున్నారు. అటూ పార్ట్‌టైమ్ జాబ్స్.. ఇటూ స్టాక్స్‌లో పెట్టుబడులంటూ రెండింట్లోనూ ఆయా సంస్థల పేర్లను ఉపయోగిస్తున్నారు. గూగుల్, టాటా, హెచ్ఎస్బీసీ, మైక్రోసాఫ్ట్ ఒకటికాదు, పేరున్న సంస్థలన్నింటి పేర్లను ఉపయోగిస్తూ ముందు, వెనుకాల ఎదో ఒక అక్షరాన్ని చేర్చుతున్నారు.
ఈ విషయాన్ని గమనించని బాధితులు అసలైన మల్టీనేషనల్ కంపెనీ పేరుపైనే దృష్టి సారిస్తున్నారు. గూగుల్ సంస్థ పార్ట్‌టైమ్ ఉద్యోగాలను అఫర్ చేస్తోందని, గూగుల్ మ్యాప్స్, గూగుల్‌లో రివ్యూస్, యూట్యూబ్ వీడియోలకు రివ్యూస్ రాయాలంటూ సైబర్‌నేరగాళ్లు సూచిస్తున్నారు.
ఆయా సంస్థల పేర్లతో పాటు సాధారణంగా వ్యాపారాలను పెంచుకోవడం కోసం గూగుల్ రివ్యూస్ బాగుండేలా, తమ తమ యూట్యూబ్ చానల్స్‌లో సబ్స్రైబర్స్ను పెంచుకోవడం ఇలా డిజిటల్ మార్కెట్లో జరిగే విషయాలే కావడంతో ఈజీగా బాధితులు నమ్మేస్తున్నారు. ఇలా పేరున్న సంస్థ పేర్లను వాడడంతో బాధితులు ఆయా సంస్థల్లో ఉద్యోగం అనగానే నిజమని నమ్మి, తరువాత బోల్తా పడుతున్నారు. పేరున్న సంస్థలు ఉద్యోగాల కోసం సోషల్‌మీడియాలో, ప్రకటనలు ఇవ్వడం, వ్యక్తిగతంగా ఫోన్లు చేయడం చేయదు.
కొన్ని ఘటనలు
నగరంలో ఉండే ఓ మహిళకు.. సైబర్ నేరగాడు ఫోన్‌చేసి.. తాము టాటా ప్రొడెక్ట్ కంపెనీ నుంచి పార్ట్‌టైమ్ వర్క్ ఆఫర్ చేస్తున్నామని, ట్రయల్ ప్రమోషన్ చేస్తున్నామని చెప్పారు. కార్టలాన్స్సీరిస్.కామ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, అందులో 25 టాస్క్లుంటాయని, అందులో మీ లాభాలు డిస్ప్లే అవుతాయంటూ నమ్మించారు. కొంత డిపాజిట్ చేయాలని, టాస్క్‌లు పూర్తి చేస్తే మీకు రివార్డు పాయింట్లు వస్తాయంటూ నమ్మించారు. ఇలా మొదట రూ. 1200 డిపాజిట్ చేయడంతో రూ. 800 లాభం చూపించారు. అది నిజమని నమ్మిన బాధితురాలు దఫ దఫాలుగా రూ. 2.27 లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయింది.
మల్కాజిగిరికి చెందిన ప్రైవేట్ ఉద్యోగురాలైన బాధితురాలి టెలిగ్రామ్ ఐడీకి గ్లోబల్ ఆన్లైన్ మీడియా పార్ట్‌టైమ్ జాబ్స్ ఆఫర్ చేస్తోందని, తాను గూగుల్ ప్రమోషన్ డిపార్టుమెంట్‌కు చెందిన ప్రతినిధినంటూ సరిత పేరుతో ఒక మెసేజ్ వచ్చింది. గూగుల్ మ్యాప్స్‌లో హోటల్ రెస్టారెంట్స్‌కు సంబంధించిన రివ్యూలు రాయాల్సి ఉంటుందని, మొదట రూ. 1040 చెల్లించాలంటూ సూచించారు. టాస్క్లుంటాయని, ఒక్కో టాస్క్‌కు రూ. 50 మీ ఖాతాలో డిపాజిట్ అవుతుందని.. 20 టాస్క్లిస్తారని, అదనంగా కావాలంటే ఇంకా ఎక్కువగా కూడా ఇస్తారంటూ నమ్మించి రూ. 8 లక్షలు ఆమెనుంచి కాజేశారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్టాక్స్‌పై పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించడంటూ ఒక ప్రకటననను చూసిన బాధితుడు, ఆ ప్రకటన క్లిక్ చేయగానే హెచ్ఎస్బీసీ స్ట్రాటజిక్ డెవెలప్మెంట్ గ్రూప్ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో అతని నంబర్ యాడ్ అయ్యింది. అందులో హెచ్ఎస్బీసీ పేరు ఉండడంతో ఇది పేరున్న సంస్థగానే బాధితుడు భావించాడు. ఆ గ్రూప్ ప్రొఫైల్‌ను పరిశీలించగా 2013లో గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు వివరాలున్నాయి, దానిని చేసి నిజమనే బావనలోకి బాధితుడు వెళ్లిపోయాడు. హెచ్ఎస్బీసీ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్‌ల్లో అందులో పనిచేసే ఉద్యోగుల మాదిరిగా నేరగాళ్లు స్టాక్స్ గురించి మాట్లాడుకుంటూ బాధితుడిని ప్రేరేపించారు. బాధితుడు అదంతా నిజమైన సంస్థగా భావించి ట్రేడింగ్ చేస్తూ సైబర్‌నేరగాళ్లు చేతిలో పడి రూ. 1.1 కోట్లు మోసపోయాడు.