సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ) : వంద కోట్ల వ్యయంతో వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్ సైకిల్ ట్రాక్ నిర్వహణ లోపంతో నిర్వీర్యమైతుందని నెటిజన్లు మండిపడుతున్నారు. నగరానికి వన్నె తెచ్చేలా చేపట్టిన ప్రాజెక్టు నిర్వహణను నిర్లక్ష్యం చేయడంతో.. ఇప్పుడు సైకిలిస్టులను ఆందోళనలకు గురి చేస్తున్నది. తాజాగా సైకిల్ ట్రాక్‌పై భారీ పగుళ్లు వచ్చాయని, పనుల్లో నాణ్యత లేదని తెరమీదకు వస్తున్న ఆరోపణలపై నెటిజన్లు మండిపడుతున్నారు. నార్సింగిలో ఔటర్ రింగురోడ్డు వద్దు 26 కిలోమీటర్ల ప్రపంచస్థాయి సైకిల్ ట్రాక్ నిర్మించగా ఏడాదిగా సరైన నిర్వహణ లేకపోవడంతో మేర పగుళ్లు వచ్చాయి.
ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సైకిల్ ట్రాక్‌పై వట్టినాగులపల్లి వద్ద ఇటీవల పగుళ్లకు గల కారణాలు, నివారణ చర్యలపై దృష్టి పెట్టాల్సిన హెచ్ఎండీఏ నాణ్యత లోపం ఉందంటూ పనులు చేసిన అధికారులను విచారించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే నాణ్యత పరిశీలన చేయాలని ఆదేశించినట్లుగా ఉంది. అయితే కింది స్థాయి సిబ్బంది మాత్రం అడుగు భాగంలో ఉండే భారీ వాటర్ పైప్ వలన ఈ పగుళ్లు ఏర్పడినట్లుగా చెబుతున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం పనుల్లో నాణ్యత పరిశీలన ప్రక్రియ చేయడం విడ్డూరంగా ఉందని చెబుతున్నారు.