సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ): నమ్మకమైన మాటలు.. కష్టపడి పనిచేస్తారనే గుర్తంపు… ఇదీ ఒకప్పడు నేపాలీ కార్మికులపై ఉన్న నమ్మకం… నేడు ఆ నమ్మకమే ప్రాణాంతకంగా మారిపోతున్నది. ముఠాలు కట్టేస్తూ మహిళలే ’బాస్’లుగా వ్యవహరిస్తూ దోపిడీ, దొంగతనాలకు స్కెచ్‌లు వేస్తున్నారు. ఏకంగా మహిళలను ముందుపెట్టి ధనవంతుల ఇండ్లను కొట్టేస్తున్నారు. ఇటీవల జరిగిన జుబ్లీహిల్స్, జవహర్‌నగర్ ఘటనలే కాకుండా అంతకు ముందు జరిగిన అప్సర షాహి కేసులోనూ మహిళలే ముఠాలకు నాయకత్వం వహించారు.
మీనా అలియాస్ మమత గ్యాంగ్…!
జవహర్‌నగర్‌లోని కౌకుర్లోని మోహన్స్ గల్ప్ ఎన్‌క్లేవ్‌లో జరిగిని దోపిడీ ఘటనలో నిందితులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ దోపిడీకి ప్లాన్ చేసింది మీనా అలియాస్ మమతగా పోలీసులు గుర్తించారు. మమత తనకు గ్యాంగ్ సభ్యురాలైన సబీనా అలియాస్ సునీతను బాధితుల ఇంట్లో పనిమనిషిగా చేర్పించింది. రాజేశ్ అనే వ్యక్తిని ఆమె భర్తగా పరిచయం చేసి ఆ ఇంట్లో పనికి కుదిర్చింది. ఈనెల 11న రాత్రి పుట్టిన రోజు వేడుకల పేరుతో గ్యాంగ్ సభ్యులందరిని ఇంటికి పిలిచి వృద్ధ దంపతులను నిర్భంధించి, వారికి మత్తు ఇచ్చి దోపిడీకి పాల్పడ్డారు.
కల్పన అలియాస్ ధర్మ
జూబ్లీహిల్స్‌లో రిటైర్డు డీజీపీ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళ గ్యాంగ్ దారుణానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. నేపాలీకి చెందిన కల్పన అలియాస్ ధర్మ మూడు నెలల కిందట తెలిసిన వారి ద్వారా రిటైర్డు డీజీపీ వినయ్‌రంజన్ రే ఇంట్లో చేరింది. అదను చూసి ఇంట్లో వినయ్‌రంజన్ భార్య కింది అంతస్తులో ఒక్కతే ఉన్న సమయంలో ఆమెను తన గ్యాంగ్ సభ్యులతో కలిసి నిర్బంధించి, హత్య చేసి భారీ దోపిడీకి పాల్పడి పరారయ్యారు. ఇప్పటి వరకు కల్పన గ్యాంగ్ సభ్యులలో ఒకరిని గుర్తించిన పోలీసులు.. మిగతా వారి ఆచూకీని మాత్రం ఇప్పటి వరకు కనిపెట్టలేకపోయారు.
అప్సర షాహి అలియాస్ మాయ
జూబ్లీహిల్స్‌లోని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో అప్సర షాహి అలియాస్ మాయ తనకు తెలిసిన నేపాలీ వ్యక్తుల ద్వారా తోటమాలిగా చేరింది. నేపాల్‌కు చెందిన నరేశ్ అనే వ్యక్తిని ఇంటి యజమానికి భర్తగా పరిచయం చేసి ఇంట్లో ఇద్దరు పనిలో చేరారు. గత మార్చి నెలలో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబ సభ్యులతో బయటకు వెళ్లాడు. అదను చూసి ఇంట్లో నుంచి కోట్ల రూపాయల సొత్తును చోరీ చేసి పరారయ్యారు. ఈ గ్యాంగ్ నేపాలీకి పరారయ్యింది. పోలీసులు నేపాల్‌కు వెళ్లి పట్టుకున్నా, సాంకేతిక కారణాలతో నిందితులను అరెస్ట్ చేయలేకపోయారు.
భవిసార అలియాస్ ఖడేల్..
దిబాన్చంద్ తాను స్వయంగా కాకుండా భార్య అని చెప్పుకొన్న భవిసార ఖడేల్ జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో తమ గ్యాంగ్ సభ్యుడైన భూపేందర్ షాహిని తోటమాలిగా నియమించింది. అదను చూసి.. భూపేందర్ షాహి తన గ్యాంగ్ లీడర్ ఖడేల్కు సమాచారం అందించడంతో ఆ వ్యాపారి ఇంట్లోకి చొరబడ్డారు. అక్కడున్న ఇతర పనివాళ్లకు మత్తు మందు ఇచ్చి యజమాని ఇంట్లో లేని సమయంలో ఆ ఇంటిలో నుంచి కోట్ల రూపాయల సొత్తును దోచుకొని పరారయ్యారు.