Mid day Meals | మేడ్చల్, డిసెంబర్ 29(నమస్తే తెలంగాణ): మధ్యాహ్న పథకం భోజన పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. మధ్యాహ్న భోజన కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం, విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు ప్రభుత్వం పెండింగ్లో పెట్టింది. దీంతో నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో అప్పులు చేసి ప్రభుత్వానికి ఎదురు పెట్టుబడి పెట్టి.. మధ్యాహ్న భోజన పథకం నిర్వహించాల్సిన పరిస్థితి మధ్యాహ్న భోజన కార్మికులకు ఏర్పడింది. దీంతో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పుల పాలవుతున్నట్లు భోజన కార్మికులు ఆందోళన చెందుతున్నారు. గతంలో చేసిన వాటికే బిల్లులను విడుదల చేయకుండా విద్యార్థులకు వండి పెట్టాలని ఒత్తిడి తేస్తున్నట్లు ఆరోపిస్తున్నారు.
అనేక బిల్లులు పెండింగ్..
భోజన ఏజెన్సీలకు అనేక బిల్లులను పెండింగ్లో పెట్టారు. ఒక్కో ఏజెన్సీకి సుమారు రూ. 80 వేల నుంచి రూ. లక్ష వరకు రావాల్సి ఉంది. అంతేకాకుండా పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థులకు ఇచ్చే మెనూ చార్జీలు పెంచాలని, ప్రసుత్తం మార్కెట్లో గుడ్డు ధర రూ. 7 ఉంటే ప్రభుత్వం మాత్రం ఇచ్చేది రూ. 4.25 ఇవ్వడం వల్ల మరింత నష్టపోతున్నట్లు ఆవేదన చెందుతున్నారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకు ఇచ్చే గౌరవ వేతనం తక్షణమే అందించాలని ప్రభుత్వానికి విజ్ఞ్ఞప్తి చేస్తున్నారు.
పెండింగ్ బిల్లులపై ఇటీవలే ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద భోజన ఏజెన్సీ కార్మికులు ధర్నా చేసిన క్రమంలో పెండింగ్ బిల్లులు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటి వరకు పెండింగ్ బిల్లులు విడుదల కాలేదని కార్మికులు చెబుతున్నారు. ప్రభుత్వం మాత్రం మధ్యాహ్న భోజన పథకంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడం మూలంగా ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పెండింగ్ బిల్లుల విడుదలకు సంబందించి ప్రభుత్వంతో పాటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
507 సర్కారు పాఠశాలల్లో..
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా 507 ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తుండగా అమల్లో మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం సక్రమంగా నిధులు విడుదల చేస్తే కార్మికుల ఇబ్బందులు తొలగడమే కాకుండా విద్యార్థులకు నాణ్యమైన భోజనం లభించే అవకాశముంటుంది. మధ్యాహ్న భోజనానికి అవసరమయ్యే వంట సరుకులకు సొంత డబ్బులతో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అనంతరం నెల తర్వాత కొనుగోలు చేసిన సరుకులకు ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుంది. అయితే మూడు నెలలుగా బిల్లులను విడుదల చేయకపోవడంతో మధ్యాహ్న భోజన కార్మికులు అప్పుల పాలవుతున్నట్లు పేర్కొంటున్నారు.