హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నీరా కేఫ్ పనులను ఎక్సైజ్‌శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీవీ నర్సింహారావు మార్గ్‌లోని నిర్మాణ స్థలంలో పనుల నాణ్యత, పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించారు. నవంబర్‌లోగా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలోనే అత్యుత్తమ నీరా పాలసీని రూపొందించి గీత కార్మికుల సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. ఆరోగ్యప్రదమైన నీరా డ్రింక్తోపాటు అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలకు కేంద్రంగా నీరా కేఫ్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని నందనవనంలో నిర్మిస్తున్న నీరా, అనుబంధ ఉత్పత్తుల అధ్యయన కేంద్రం పనులను కూడా వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దశలవారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో నీరా కేఫ్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.