సిటీబ్యూరో, మే 30 (నమస్తే తెలంగాణ): షోరూం నుంచి వాహనాలకు వచ్చే సైలెన్సర్లు కాకుండా.. వాటికి మరమ్మతులు చేసి ఇష్టానుసారంగా తయారు చేసుకుంటూ శబ్ద, వాయుకాలుష్యానికి కారకులవుతున్న వారిపై రాచకొండ ట్రాఫిక్ పోలీసులు కొరఢా ఝళిపిస్తున్నారు. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ రోడ్లపై వెళ్లే బైక్‌లు.. కార్ల సైలెన్సర్లను ఉపయోగించే వారిపై కేసులు నమోదు చేయడమే కాకుండా ఆయా సైలెన్సర్లను తొలగించేస్తున్నారు.
ఇలా తొలగించిన 1297 మోడిఫైడ్ సైలెన్సర్లను తొలగించి వాటిని రోడ్డు రోలర్‌తో తొక్కించి ధ్వంసం చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలతో నేషనల్ క్లిన్ ఎయిర్ ప్రొగ్రామ్(ఎన్సీఏపీ) అండ్ మిషన్ లైఫ్ క్యాంపెయిన్‌లో భాగంగా అధిక శబ్దాలు వెదజల్లే సైలెన్సర్ కలిగిన వాహనదారులను పట్టుకోవడం కోసం నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో 2325 కేసులు నమోదు చేశారు.
అందులో భాగంగా.. అధిక శబ్దం వచ్చేలా మార్చుకున్న 1297 సైలెన్సర్లను శుక్రవారం ఎల్బీనగర్ డీసీపీ ప్రవీణ్‌కుమార్, ట్రాఫిక్ డీసీపీలు వి.శ్రీనివాసులు, మల్లారెడ్డి, ఉమెన్ సేఫ్టీ డీసీపీ ఉషారాణి, ట్రాఫిక్ అదనపు డీసీపీలు ఎ.లక్ష్మి, జి.శ్రీనివాస్‌కుమార్ తదితర అధికారుల సమక్షంలో ఉప్పల్ భగాయత్‌లో సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు.