సుల్తాన్‌బజార్, జూన్ 19 : వివేక్ వర్ధిని ఎడ్యుకేషన్ సొసైటీ(వీవీఈఎస్)కి ఎంతో గొప్ప పేరు, ప్రఖ్యాతులు ఉన్నాయని, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో గొప్ప స్థానాల్లో ఉన్నారని ఎన్సీఈఆర్టీ అడిషనల్ డైరెక్టర్ జి.రమేశ్ పేర్కొన్నారు. బుధవారం టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ ఆధ్వర్యంలో గౌలిగూడలోని వివేక్ వర్ధిని కన్యశాల ప్రైమరీ స్కూల్లో సామాజిక సేవలో భాగంగా తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన టెక్నిప్ ఎఫ్ఎంసీ ఎండీ అర్జున్ రుమాల, వివేక్ వర్ధిని ఎడ్యుకేషన్ సొసైటీ జాయింట్ సెక్రటరీ అనిల్ రాజేశ్వర్, వివేక్ వర్ధిని కన్యశాల ప్రైమరీ స్కూల్ చైర్మన్ కాంచన్ జట్కార్లతో కలిసి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 108 ఏండ్ల గొప్ప వారసత్వాన్ని పూర్తి చేసుకున్న వివేక్ వర్ధిని కన్యశాల ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిందన్నారు. టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా పాఠశాలలో తరగతి గదులను నిర్మించడం గొప్ప విషయమని, విద్యాశాఖ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ ఎండీ అర్జున్ రుమాల మాట్లాడుతూ.. వందేళ్లు పూర్తి చేసుకున్న పాఠశాలలో విద్యార్థుల విద్యాభ్యాసం కోసం తరగతి గదులను నిర్మించే అవకాశం వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా 200 మంది విద్యార్థులకు స్కూల్స్ బ్యాగ్స్ అందజేశామన్నారు. టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా సంయుక్తాధ్వర్యంలో పాఠశాల తరగతి గదులు నిర్మించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో వివేక్ వర్ధిని కన్యశాల హెడ్మాస్టర్ అశోక్ కరాట్, ప్రిన్సిపాల్ వైశాలి, టెక్నిప్ ఎఫ్ఎంసీ సంస్థ సీఎస్ఆర్ హెడ్ నిరంజన్ దేశాయ్, ఫైనాన్స్ హెడ్ నరేందర్‌కుమార్, హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఇండియా చీఫ్ మేనేజర్ జాన్ క్రిష్టఫర్, సుజాత తదితరులు పాల్గొన్నారు.