బంజారాహిల్స్, నవంబర్ 5: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా బుధవారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి రోడ్‌షోకు స్వాగతం పలుకుతూ షేక్‌పేట డివిజన్లోని పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిలో పార్టీ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఫొటో లేకపోవడం కలకలం రేపింది.
స్థానిక నేతలు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీల్లో సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు వివేక్, అజారుద్దీన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్‌తో పాటు ఇతర నేతలందరి ఫొటోలు వేయగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ఫొటో లేకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో కాంగ్రెస్ అభ్యర్థి వర్గానికి చెందిన నాయకులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. పార్టీ నేతల్లో ఉన్న అసంతృప్తిని, గ్రూపులను ఈ ఫ్లెక్సీ వ్యవహారం బయటపెట్టినట్లయిందని సొంత పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.