సిటీబ్యూరో, మే 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరానికి స్వచ్ఛమైన గాలిని అందించడంలో కీలకపాత్రను పోషించే కేబీఆర్ పార్క్.. కాంగ్రెస్ చేపట్టిన హెచ్ సిటీ ప్రాజెక్టుతో నగర లంగ్ స్పేస్‌ను లూటీ చేస్తోంది. జాతీయ పార్కు చుట్టూ భారీ ఫ్లైఓవర్లు, అంతకు మించిన వాహనాల రద్దీని పెంచేలా రేవంత్ సర్కార్ రూపొందించిన ప్రణాళికలు అరుదైన పర్యావరణ సంపదను కబళించేలా మారింది. చివరకు జాతీయ రోడ్ కాంగ్రెస్ నిబంధనలకు విరుద్ధంగా, పర్యావరణ సమతుల్యతను తుంగలో తొక్కి ప్రభుత్వం సాగిస్తున్న విధ్వంసంపై ప్రకృతి ప్రేమికులు, పౌర సమాజం భగ్గుమంటోంది.
వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి, సహజసిద్ధంగా ఎదిగిన అటవీ సంపద, అంతకు మించి ఉండే అరుదైన జీవవైవిధ్యంతోపాటు, శరవేగంగా విస్తరించిన కాంక్రీట్ జంగిల్‌తో కనుమరుగైన ఎన్నో అరుదైన వన్యప్రాణులకు కేంద్రంగా ఉన్న కేబీఆర్ జాతీయ పార్క్ ఉంది. అయితే కాంగ్రెస్ సర్కార్‌కు ఏ మాత్రం పర్యావరణ స్పృహ లేకుండా ప్రకృతిని నిర్వీర్యం చేసేలా ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేస్తోంది. ఓవైపు సిటీ లంగ్ స్పేస్‌ను కాపాడుకునేందుకు సామాన్య జనాలు రోడ్డెక్కుతుంటే… అభివృద్ధి పేరిట అడ్డు వస్తే ఏదైనా తొలగిస్తామన్నట్లుగా, భావితరాలకు పచ్చదనం ఏంటనే అనుమానం కలిగేలా, ఇప్పటికే కాంక్రీట్ జంగిల్‌ను తలపించే హైదరాబాద్ నగరంలో ద్వీపకల్పం వంటి కేబీఆర్ పార్క్‌ను ఛిన్నాభిన్నం చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
విస్తుగొలిపే విధ్వంసపు మారణాయుధాలు
కేబీఆర్ పార్క్ చుట్టూ కాంగ్రెస్ చేపడుతున్న అండర్ పాస్లూ, మల్టీ లెవల్ పార్కింగ్ స్టేషన్లు, ఫ్లైఓవర్ల ప్రాజెక్టులతో పర్యావణానికి జరిగే విధ్వంసపు పరిమాణం విస్తుగొలిపిస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అంచనా వేసిన ముడి పదార్ధాల లెక్కలు చూస్తేనే పచ్చని గుండెపై సర్కారు దించుతున్న కాంక్రీట్ గునపాల తీవ్రత తెలిసిపోతుంది. మొత్తం ప్రాజెక్టు కోసం దాదాపు 29వేల టన్నుల సిమెంట్, 18344 టన్నుల ఉక్కుతోపాటు, కేబీఆర్ పార్క్ చుట్టూ ఏకంగా 1.77 లక్షల క్యూబిక్ మీటర్ల భూమిని తవ్వేయనున్నారు. పార్క్‌ను చుట్టుముట్టినట్లుగా నిర్మించనున్న 7 మల్టీ లెవల్ కాంక్రీట్ ఫ్లై ఓవర్లు, 7 అండర్ పాస్‌ల నిర్మాణంతో బయటకు కనిపించే పర్యావరణమే కాకుండా… భూమి అడుగున ఉన్న భూగర్భ జలాలకు పెను ప్రమాదం పొంచి ఉందనీ నిపుణులు భావిస్తున్నారు.
ఈ ప్రాజెక్టు కారణంగా ముఖ్యమైన భూగర్భ జలాల పునరుద్ధ్దరణ పూర్తిగా దెబ్బతినే ప్రమాదంలో పడింది. చుట్టూ వచ్చే కాంక్రీట్ నిర్మాణాలతో భూమిలోకి చేరాల్సిన వర్షపు నీరు… నేరుగా డ్రైనేజీలో చేరి, చుట్టూ ప్రక్కల ఉండే కాలనీలను ముంచెత్తనుంది. ఇదే నేషనల్ రోడ్ కాంగ్రెస్ చెప్పే నిబంధనలను తుడిచిపెట్టేలా ఉంది. దీని ద్వారా పరిమితికి మించి కాంక్రీట్ వినియోగం పెరిగి, ఈ ప్రాంతంలో భూగర్భ, పర్యావరణ, వాతావరణ పరిస్థితులన్నీ మారిపోయే అవకాశం ఉందనీ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. పార్కు పరిసరాల్లో ఉష్ణోగ్రత సాధారణం కంటే 3-5 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని భావిస్తున్నారు. కేవలం సిమెంటు ఉక్కు వినియోగంతోనే ఏకంగా 59వేల టననుల కార్బన్ ఉద్గారాలు వెలువడుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ సర్కార్ అభివృద్ధి పేరిట పర్యావరణంపై ఎక్కు పెట్టిన మారణాయుధాలని పర్యావరణ, సామాజిక కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరుదైన వన్యప్రాణులకు ప్రమాదం
కేబీఆర్ పార్క్ చుట్టూ విస్తరించి ఉన్న జీవవైవిధ్యంపై సర్కార్ గొడ్డలి వేటుతో అరుదైన వన్యప్రాణులకు ప్రమాదం పొంచి ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. ప్రస్తుతం ఇక్కడ 100-140 పక్షి జాతులు, అరుదైన సీతాకోక చిలుక జాతులు, అంతకు మించి ఉన్న వృక్షజాతులు, పాంగొలిన్, అడవి పందులు, జంగిల్ క్యాట్ వంటి చిన్న చితకా జంతువులకు ఆవాసంగా ఉంది. ఈ ప్రాజెక్టు మొదలు కావడంతోనే ఇన్నాళ్లు పచ్చని పర్యావరణంలో స్వేచ్ఛగా జీవనం సాగించిన ఈ వన్యప్రాణులకు కాంక్రీట్ నిర్మాణాలు అడ్డుగోడలుగా మారనున్నాయి. వీటి ఉనికే ప్రమాదంలో పడనుంది. గడిచిన ఏడాది కాలంగా కాంగ్రెస్ చేపట్టిన విధ్వంసకర ప్రణాళికలను నిలువరించేలా స్థానికులు ఆందోళనలు చేపడుతున్నారు. కానీ కాంగ్రెస్ చేపట్టే పర్యావరణ విధ్వంసపు ప్రణాళికల ముందు నిలువలేకపోతున్నాయి. వేల కోట్ల ప్రజాధనంతో ప్రకృతి కాలరాయడమే పరమార్థంగా సర్కార్ తీరు ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది.