Rashtrapati Nilayam | బొల్లారం, ఫిబ్రవరి 22: జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 27, 28వ తేదీల్లో రాష్ట్రపతి నిలయంలో జాతీయ వైజ్ఞానిక దినోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి నిలయం అధికారి రజిని ప్రియ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విజ్ఞాన ఆవిష్కరణ ప్రదర్శనలు రెండు రోజులపాటు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. దీని ద్వారా విద్యార్థులు విజ్ఞానం, సాంకేతికతో నూతన పరిణామాలు అన్వేషించుకు నే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నస్టిక్స్(సీడీఎఎఎఫ్ ఢీ), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ( ఎన్ఆర్ఎస్సి), సీఎస్ ఐఆర్ -సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మోలక్యులర్ బయాలజీ(సీసీఎంబీ), సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్(ఎన్ఐఎన్) , నేషనల్ జియోఫినికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఎన్జీఆర్ఐ) సంస్థలు తమ పరిశోధన, అభివృద్ధి ఆవిష్కరణలను ప్రదర్శించడానికి స్టాల్స్ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. అదేవిధంగా జన విజ్ఞాన వేదిక, డెక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ విజ్ఞాన, సాంకేతికత, వారసత్వంపై పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నారని తెలిపారు.
భారతదేశంలోని శాస్త్రజ్ఞుల ఫోటో ప్రదర్శన, ప్రముఖ శాస్త్రవేత్తల అకాడమిక్స్, ఇన్నోవేటర్స్ ఆధ్వర్యంలో విజ్ఞానంలో పురోగతి, శాస్త్రంతో సరదా, సైన్సును అవగతం చేసుకోవడంతో పాటు కెరీర్లు అంతరిక్ష అన్వేషణ, శాస్త్రంలో ఆవిష్కరణలు వంటి విభిన్న ఆసక్తికర అంశాలను ఉద్దేశించి వర్క్ షాపులు నిర్వహించబడతాయని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్విజ్, సైన్స్ మోడల్ ఎగ్జిబిషన్లు, పోస్టర్ మేకింగ్ వంటి పోటీలు కూడా ఉంటాయని వెల్లడించారు. కావున ఆసక్తి కలిగిన విద్యార్థులు రాష్ట్రపతి నిలయం వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు రాష్ట్రపతి నిలయం 040-29560518 ను సంప్రదించవచ్చని సూచించారు.