సిటీబ్యూరో, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): గృహ హింస, లైంగిక, లైంగిక వేధింపులు, సైబర్ క్రైమ్ బాధిత మహిళలకు జాతీయ మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని చైర్పర్సన్ విజయ రహత్కర్ అన్నారు. సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా సమగం హాల్ లో ఏర్పాటు చేసిన మహిళా జన్ సున్వాయి( బహిరంగ విచారణ)లో ఆమె పాల్గొని కేసులు పరిష్కరించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ… హైదరాబాద్ లో కమిషన్ మొదటగా ఏర్పాటు చేసి మహిళా బాధితుల నుంచి 60 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. మహిళలు పడుతున్న బాధలు, కష్టాలు, సమస్యలను సత్వరం పరిష్కరించడానికి కమిషన్ నేరుగా బాధితుల వద్దకే వస్తుందన్నారు.
గృహహింస కేసులు, సైబర్ నేరాలు, ఆన్లైన్ వేధింపులు, చైల్డ్ కస్టడీ కేసులు, లైంగిక వేధింపులు, లైంగికదాడులతో పాటు ఇతర కేసులు కూడా కమిషన్ దృష్టికి వచ్చాయని చెప్పారు. హైదరాబాద్ పరిధి లో 2022 నుంచి 2024 దాకా ఉన్న కేసుల్లో సత్వరమే 30 కేసులను పరిష్కరించి బాధితులకు న్యాయం చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శారద నేరెళ్ల, మహిళా సంక్షేమ శాఖ సంచాలకులు క్రాంతి వెస్లీ, అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్స్ విశ్వ ప్రసాద్, అదనపు కలెక్టర్ ముకుందారెడ్డి తదితరులు పాల్గొన్నారు.