Hyderabad | గచ్చిబౌలి నుంచి ప్రారంభమయ్యే ఔటర్ రింగు రోడ్డు మొదటి ఇంటర్చేంజ్ నానక్‌రాంగూడ మహానగరానికి నయా ఐకానిక్‌గా మారుతున్నది. నలువైపులా ఆకాశహర్మ్యాలు.. విశాలమైన రోడ్లు.. ఇరువైపులా 4 వరుసలతో సర్వీసు రోడ్లతో సరికొత్తగా దర్శనమిస్తున్నది. హెచ్ఎండీఏ పరిధిలోని హెచ్‌జీసీఎల్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉండడంతో హెచ్ఎండీఏ కమిషనర్ నుంచి మంత్రి కేటీఆర్ వరకు అన్ని సమీక్షలు ఇక్కడి నుంచే జరుగుతున్నాయి. సాస్ ఐ టవర్ పేరుతో 34 అంతస్తులతో కూడిన వాణిజ్య భవనం దాదాపు సిద్ధమైంది. మరికొన్ని రియల్ సంస్థలు భారీ భవన నిర్మాణాలకు అనుమతులు పొంది ఉన్నాయి. ఐటీ కంపెనీలు కూడా మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలిని దాటి నానక్‌రాంగూడ, పుప్పాలగూడ, కోకాపేట, నార్సింగి దాకా విస్తరించాయి. ఇలా గచ్చిబౌలి నుంచి నానక్‌రాంగూడ మీదుగా ఉన్న ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. దీనికి తోడు హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లైన్లో నానక్‌రాంగూడ ఇంటర్చేంజ్ వద్దే మెట్రోస్టేషన్ రాబోతుండడం విశేషం.
సిటీబ్యూరో, మార్చి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరానికి మణిహారంలా మారిన ఔటర్ రింగు రోడ్డు రూపు రేఖలు మారుతున్నాయి. ఓఆర్ఆర్ కేంద్రంగా కొనసాగుతున్న అభివృద్ధి వేగంగా జరుగుతుంటే, అదే స్థాయిలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలు వివిధ రంగాల్లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఐటీ కారిడార్‌లోని గచ్చిబౌలి నుంచి ప్రారంభమయ్యే ఓఆర్ఆర్ అనుసంధాన రహదారికి ఇరువైపులా ఆకాశమే హద్దు అన్నట్లుగా 40 నుంచి 59 అంతస్తుల భవనాలు నిర్మాణంలో ఉన్నాయి. ఔటర్ రింగు రోడ్డుపై మొదటి ఇంటర్చేంజ్ నానక్‌రాంగూడ వద్ద నిర్మించారు. ఇక్కడ అత్యంత విశాలమైన రోడ్లతో పాటుట్రాఫిక్ ఐ ల్యాండ్లు, ఇరువైపులా 4 వరుసలతో సర్వీసు రోడ్లు ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఐటీ కంపెనీల కార్యకలాపాలు మాదాపూర్, రాయదుర్గం, గచ్చిబౌలిని దాటి నానక్‌రాంగూడ, పుప్పాల్‌గూడ, కోకాపేట, నార్సింగి దాకా విస్తరించాయి. దీంతో గచ్చిబౌలి నుంచి నానక్‌రాంగూడ మీదుగా ఉన్న ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్‌గా మారింది.
ప్రస్తుతం నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్‌చేంజ్‌కు నలువైపులా 30 నుంచి 50 అంతస్తులతో నిర్మిస్తున్న ఎత్తయిన భవనాలు ఉన్నాయి. సాస్ ఐ టవర్ పేరుతో 34 అంతస్తులతో కూడిన కమర్షియల్ భవనం దాదాపు పూర్తి కావొచ్చింది. దీంతో ఇతర రియల్ ఎస్టేట్ కంపెనీలు భారీ ఎత్తయిన భవనాలను నిర్మించేందుకు అనుమతి పొంది నిర్మాణం పనులు చేపట్టారు. ఇలా నలువైపులా భారీ భవనాలే కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఓఆర్ఆర్ నగరం బయట ఎంతో విశాలంగా ఉండే రోడ్డుగా పేరుంది. అలాంటి విశాలమైన రోడ్డు వెంట కొనసాగుతున్న భారీ నిర్మాణాలు నానక్రాంగూడను మరో ఇకానిక్ సెంటర్‌గా మార్చేస్తున్నాయి.
ఔటర్ రింగు రోడ్డు ప్రాజెక్టును హెచ్ఎండీఏ పరిధిలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (హెచ్‌జీసీఎల్) చేపట్టింది. ఔటర్ రింగు రోడ్డు నిర్వహణ కోసమే ఉన్న హెచ్‌జీసీఎల్ ప్రధాన కార్యాలయం సైతం నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్ చేంజ్లోనే ఉంది. ఇక్కడి నుంచే ఓఆర్ఆర్ నిర్వహణ పూర్తి స్థాయిలో జరుగుతోంది. హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయం అమీర్‌పేటలో ఉన్నా, హెచ్ఎండీఏ కమిషనర్ ఎక్కువగా నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ కార్యాలయం నుంచే పరిపాలనా పనులు నిర్వహిస్తుంటారు. రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సైతం ఇక్కడే తరచూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తుండటంతో ఈ ప్రాంతానికి ఎంతో ప్రాధాన్యత నెలకొంది. హైదరాబాద్ నగరంలో నడిపేందుకు కొత్తగా కొనుగోలు చేసిన డబుల్ డెక్కర్ ఎలక్ట్రికల్ బస్సులను ఇక్కడి నుంచే మంత్రి కేటీఆర్ జెండా ఊపి ప్రారంభించారు. ఇలా ప్రభుత్వ కార్యకలాపాలకు సైతం నానక్‌రాంగూడ అత్యంత కీలకమైన కేంద్రంగా మారింది.
Hyderabad21
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లైన్ మార్గం సైతం నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ వద్దే కలుస్తోంది. ఇక్కడి నుంచే శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు ఓఆర్ఆర్ వెంబడి మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు మెట్రో అధికారులు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కొత్తగా నిర్మించే ఎయిర్‌పోర్టు మెట్రో లైన్లో రాయదుర్గం ప్రారంభ మెట్రో స్టేషన్ తర్వాత అత్యంత ప్రాధాన్యత కలిగిన స్టేషన్‌గా నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ స్టేషన్ మారనుంది. ఇక్కడి నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, శంషాబాద్ వైపు, జూబ్లీహిల్స్ , గచ్చిబౌలి వైపు వెళ్లేందుకు అత్యంత అనుకూలమైన కేంద్రంగా మారనుంది. వీటికి తోడు ఓఆర్ఆర్ చుట్టూ నిర్మిస్తున్న సోలార్‌రూఫ్ టాఫ్ సైకిల్ ట్రాక్ నిర్మాణం సైతం నానక్‌రాంగూడ ఓఆర్ఆర్ ఇంటర్చేంజ్ నుంచే ప్రారంభం కానుంది. ప్రస్తుతం పురోగతిలో ఉన్న ఈ పనులు మరో రెండు మూడు నెలల్లోనే పూర్తి కానుండగా, రెండు వరుసలతో ఉన్న ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డును సైతం 4 వరుసలతో నిర్మించే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.