నగరంలో ప్రతియేటా కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతూ నిర్వహిస్తున్న నుమాయిష్ సందడి మళ్లీ మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో 83వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను సోమవారం ఐటీ శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. 1938లో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ప్రారంభమైన ఎగ్జిబిషన్ 1946లో ఎగ్జిబిషన్ మైదానంలోకి మారింది. 26 ఎకరాల సువిశాల మైదానంలో ప్రస్తుతం సందర్శకుల కోసం 2400 స్టాల్స్ అందుబాటులో ఉన్నాయని ఎగ్జిబిషన్ కార్యదర్శి బి.హన్మంతరావు తెలిపారు.
సిటీబ్యూరో, జనవరి 1(నమస్తే తెలంగాణ)/తెలుగు యూనివర్సిటీ: నగరంలో ప్రతి యేటా నిర్వహిస్తున్న నుమాయిష్ హైదరాబాద్ మహా నగరానికి ఎంతో ప్రాధాన్యత తెచ్చిందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు. 83వ అఖిల భారత ప్రారిశ్రామిక ప్రదర్శన కార్యక్రమానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లతో కలిసి సోమవారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో నుమాయిష్-2024 ప్రదర్శనను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
అనంతరం, సీఎం మాట్లాడుతూ.. దేశంలోనే హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్‌బండ్ తర్వాత గుర్తొచ్చేది నుమాయిష్ అని పేర్కొన్నారు. ప్రతియేటా నుమాయిష్‌ను ప్రాధాన్యత తగ్గకుండా నిర్వహిస్తున్న సొసైటీకి అభినందనలు తెలిపారు. కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీని ఇంజినీరింగ్ కళాశాలగా అప్‌గ్రేడ్ చేయడానికి ప్రభుత్వం తరపు నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పారు. అట్లాగే సామాజిక బాధ్యతతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాటితో పాటు సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యా సంస్థలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వివరించారు.
చారిత్రక నగరానికి గుర్తింపు తెచ్చిన నుమాయిష్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు అండగా ఉంటామన్నారు. ఎగ్జిబిషన్ నిర్వహణలో సమస్యలుంటే పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని సొసైటీ సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రధానంగా హస్తకళాకారుల నిపుణత, కళాకృతులు దేశాన్నే ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. తాను కూడా ఎగ్జిబిషన్‌కు వచ్చేవాడినని గుర్తు చేశారు.
సందర్శకులకు అందుబాటులో 2400 స్టాల్స్..
కాగా, 1938లో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో ప్రారంభమైన ఎగ్జిబిషన్ 1946లో ఎగ్జిబిషన్ మైదానంలోకి మారింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 26 ఎకరాల సువిశాల మైదానంలో నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం, సందర్శకుల కోసం 2400 స్టాల్స్ అందుబాటులో ఉన్నాయని ఎగ్జిబిషన్ కార్యదర్శి బి.హన్మంతరావు తెలిపారు. విభిన్న సంస్కృతుల కళాకృతులు, దుస్తులు, ఆహార ఉత్పత్తులు నుమాయిష్‌లో కొలువుదీరాయి.
ఫిబ్రవరి 15 వరకు 45 రోజుల పాటు నుమాయిష్ కొనసాగనున్నది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఉత్పత్తులు ప్రజలకు ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి. సోమవారం సాయంత్రం నగరవాసులు కుటుంబ సభ్యులతో కలిసి నుమాయిష్‌ను సందర్శింగా పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. విద్యుత్ దీపాల వెలుగులతో ప్రతి స్టాల్ సందర్శకులను ఆకర్షిస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అమ్యూజ్మెంట్ పార్కు, ఫుడ్ కోర్టులు, ట్రైన్ ప్రజలకు సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి.
కట్టుదిట్టమైన భద్రత
ప్రతి రోజు వేలాది మంది సందర్శించే నుమాయిష్‌కు పోలీస్ యంత్రాంగం భద్రత కట్టుదిట్టం చేసింది. ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను నెలకొల్పడంతో పాటు ప్రతి వ్యక్తిని తనిఖీలు చేసిన అనంతరం, నిర్వాహకులు ప్రదర్శనకు అనుమతి ఇస్తున్నారు. మఫ్టీలో పోలీసులు నిఘాను పర్యవేక్షిస్తున్నారు. అగ్నిమాపక యంత్రాలు అందుబాటులో ఉంచి ప్రమాదాలు చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండేలా పర్యవేక్షిస్తున్నారు.
యావత్ తెలంగాణకు గర్వకారణం
మంత్రి శ్రీధర్‌బాబు
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. నుమాయిష్ యావత్ తెలంగాణకు గర్వకారణంగా నిలుస్తున్నదన్నారు. ఎనిమిది దశాబ్దాలుగా ప్రదర్శనను నిర్వహిస్తున్న వారిని అభినందించారు. ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఎగ్జిబిషన్.. దాదాపు 20కి పైగా విద్యా సంస్థలను ప్రారంభించారని, 30వేల మంది వరకు విద్యార్థులు చదువుతుండటం గొప్ప విషమని చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలకు నుమాయిష్ ఒక వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆణి ముత్యంలా నుమాయిష్ యావత్ భారత్‌కే షాన్‌గా నిలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు సత్యేందర్, కార్యదర్శి బి.హన్మంతరావు, కోశాధికారి రాజేందర్, కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు, మహేశ్ కుమార్ గౌడ్, సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక కేంద్రాలు కిటకిట..
నూతన సంవత్సరంలో ఆశలు, ఆశయాలు భగవంతునికి విన్నవించేందుకు భక్తులు ఆలయాలు, చర్చిలకు పోటెత్తారు. నగరంలోని పలు ఆధ్యాత్మిక కేంద్రాలైన గుడులు, గోపురాలు, చర్చిలు సోమవారం భక్తుల కోలాహలంతో కిక్కిరిసిపోయాయి. ప్రతి భక్తుడు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం భిన్నంగా, ఉన్నతంగా ఉండాలని, ఆర్థికంగా అంతా మంచే జరగాలని ఆయా దేవుళ్లను కోరుకున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ప్రధాన ఆధ్యాత్మిక కేంద్రాలైన బిర్లా మందిర్, పెద్దమ్మ ఆలయం, గోల్కొండ జగదాంబిక ఆలయం, లాల్‌దర్వాజలోని సింహా వాహిని మహంకాళి, చార్మినార్ భాగ్యలక్ష్మి, లష్కర్ ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, జూబ్లీహిల్స్ టీటీడీ వేంకటేశ్వర స్వామి ఆలయాలు, సికింద్రాబాద్‌లోని సెయింట్ మేరీ, తదితర చర్చిలు భక్తజన సందోహంతో కిటకిటలాడాయి. కొత్త సంవత్సరం, మొదటి రోజు కావడంతో రానున్న రోజులు మంచిగా ఉండాలని భక్తులు ఆశలతో భగవంతుని సన్నిధికి చేరి వారి ఆకాంక్షలను ఏకరువు పెట్టుకున్నారు.