సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్, నవంబర్ 14 (నమస్తే తెలంగాణ): నాంపల్లి బజార్‌ఘాట్ అగ్నిప్రమాదానికి అపార్టుమెంట్ నీళ్ల కోసం ఉపయోగించే విద్యుత్ మోటర్ వైరింగ్‌లో ఉన్న సమస్యతో ఏర్పడిన షార్ట్‌సర్క్యూటే కారణమని తేలింది. నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో సోమవారం ఉదయం రమేశ్ జైస్వాల్‌కు చెందిన బాలాజీ అపార్టుమెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో జరిగిన అగ్నిప్రమాదం 9 మందిని బలితీసుకుంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు విశ్లేషిస్తున్నారు. సోమవారం షార్ట్ సర్క్యూట్ అని చెబుతూనే.. పిల్లలు పటాకులు కాల్చడంతో నిప్పురవ్వలు కెమికల్ డ్రమ్స్పై పడి మంటలు అంటుకునే అవకాశం ఉన్నదని అధికారులు వెల్లడించారు.
అయితే మంగళవారం ప్రమాదం జరిగేందుకు అవకాశాలున్న కోణాల్లో విశ్లేషణ చేసి.. విద్యుత్ మోటర్ వైర్‌తోనే ఈ ప్రమాదం జరిగినట్లు తేల్చారు. సోమవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో అపార్టుమెంట్‌పైకి నీళ్లు తరలించే మోటర్‌ను వాచ్‌మన్ ఆన్ చేశాడు. ఆ మోటర్ 7.30 నుంచి 9 గంటల వరకు నడిచింది. ఆ మోటర్‌కు సంబంధించిన స్టాటర్ బోర్డు, ఎంసీబీలు పక్క పక్కనే ఉన్నాయి. మెయిన్ లైన్ నుంచి స్టార్టర్కు, స్టార్టర్ నుంచి మోటర్‌కు ఉన్న విద్యుత్ తీగలు బలంగా లేవు. స్టార్టర్ నుంచి మోటర్‌ను కలిపే వైర్లో ఒక చోట వైర్ వేడి కావడంతో వైర్లో నుంచి మంట వచ్చింది. పక్కనే ఫైబర్ షీట్స్, అట్టపెట్టెలు ఉన్నాయి. ఆ పక్కనే కెమికల్ డ్రమ్ములు కూడా ఉన్నాయి.
అన్ని ఒకే చోట ఉండటంతో విద్యుత్ వైర్ నుంచి వెలువడిన స్పార్క్‌తో మంటలు ప్రారంభమయ్యాయి. మొదట్లో వాచ్‌మన్‌ను మంటలార్పేందుకు ప్రయత్నించాడు. అట్టపెట్టేల పక్కనే ఉన్న కెమికల్ డబ్బాలకు మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా అదుపు తప్పాయి. వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ చేయడంతో ఘటనా స్థలికి ఫైరింజన్లు చేరుకొని మంటలను ఆర్పేసి, అపార్టుమెంట్లో ఉన్న కొందరిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. మరికొందరు మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి యజమాని రమేశ్ జైస్వాల్ అక్కడే ఉన్నాడు. మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాడు. ఒక్కసారిగా మంటలంటుకున్న దృశ్యం చూసి కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని దవాఖానకు తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు.
క్లూస్‌టీమ్ పరిశీలన
ప్రమాదం జరిగిన బాలాజీ అపార్టుమెంట్లో హైదరాబాద్ క్లూస్ టీమ్ హెడ్ వెంకన్న నేతృత్వంలోని బృందం పలు ఆధారాలు సేకరించింది. కెమికల్ డబ్బాలలో నుంచి వెలువడిన రసాయనాలు, ఫైబర్, ప్లాస్టిక్ షీట్స్, అట్టపెట్టెలతో పాటు సుమారు 50 రకాల నమూనాలను ప్రమాద స్థలి నుంచి సేకరించారు. విద్యుత్ మీటర్ నుంచి మోటర్ వరకు వెళ్లే విద్యుత్ తీగలు వేడి కావడంతో అవి కాలుతూ వెళ్లి మధ్యలో అట్టపెట్టెలకు అంటుకొని ప్రమాదం సంభవించినట్లు కొన్ని ఆధారాలను సేకరించారు. సేకరించిన నమూనాలన్నింటినీ విశ్లేషణ కోసం ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. ఇదిలాఉండగా.. అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయిన బాలాజీ అపార్టుమెంట్ పటిష్టతను జేఎన్టీయూ నుంచి వచ్చిన సివిల్ ఇంజినీర్స్ బృందం మంగళవారం పరిశీలించింది. భవనానికి పరీక్షలు నిర్వహించి.. భవన సామర్థ్యంపై అధికారులకు నివేదిక ఇవ్వనున్నారు.