KTR | నాంపల్లి క్రిమినల్ కోర్టులు, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పెండింగ్‌లో ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఎమ్మేల్యే ముఠాగోపాల్‌పై ఉన్న కేసును కొట్టివేస్తూ బుధవారం జడ్జి శ్రీదేవి తీర్పు ప్రకటించారు. ముషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో కేటీఆర్, ముఠా గోపాల్‌పై కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ప్రచారాన్ని నిర్వహించారని వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కేటీఆర్, ముఠా గోపాల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం కేసును తొలగించాలని నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వు ప్రతిని న్యాయవాది జక్కుల లక్ష్మణ్ కోర్టుకు సమర్పించడంతో ఉత్తర్వు ప్రకారం ఇద్దరిపై కేసును తొలగించినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో వారిపై తప్పుడు కేసులు బనాయించారని, హైకోర్టు తీర్పు హర్షణీయమని న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు.