మన్సూరాబాద్, జూలై 18: నూతనంగా ఏర్పాటు చేస్తున్న పోలీస్స్టేషన్లతో ప్రజలకు మరింత భద్రత పెరుగుతున్నదని రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహాన్ తెలిపారు. నాగోల్‌లోని మమతానగర్కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన నాగోల్ పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం సాయంత్రం స్థానిక ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. అదేవిధంగా ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయం మొదటి అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన డీసీపీ కార్యాలయాన్ని కూడా సీపీ డీఎస్ చౌహాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగోల్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీపీ డీఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి చూపిన చొరవతో మమతానగర్కాలనీలో తాత్కాలిక పోలీస్‌స్టేషన్‌కు అవకాశం దక్కిందని తెలిపారు. యువజన సంఘం భవనంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు సహకరించిన నవచైతన్య యువజన సంఘం కార్యవర్గానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
సీజ్ చేసిన వాహనాల రక్షణ కోసం తట్టిఅన్నారం ప్రాంతంలో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయించారని, అక్కడే కొత్త పోలీస్‌స్టేషన్ నిర్మించి అక్కడి నుంచే ప్రజలకు సేవలందిస్తామని తెలిపారు. ప్రజలకు భద్రత, సెక్యూరిటీ, సేఫ్టీ కల్పించేందుకు సీఎం కేసీఆర్ పోలీసు యంత్రాంగాన్ని ఎంతో పటిష్టంగా తయారు చేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. యువజన సంఘం భవనంలో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం కల్పించిన నవచైతన్య యువజన సంఘానికి, కాలనీవాసులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. నాగోల్‌లో పోలీస్‌స్టేషన్ ఏర్పాటు కోసం సీపీ డీఎస్ చౌహాన్, డీసీపీ సాయిశ్రీ ఎంతో కృషి చేశారని తెలిపారు. పోలీస్‌స్టేషన్‌ను ఇక్కడి నుంచి తరలించిన వెంటనే యువజన సంఘానికి ఉపయోగపడే విధంగా అదనపు ఫ్లోర్‌ను నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు.
పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు సహకరించిన నవచైతన్య యువజన సంఘం అధ్యక్షుడు చెరుకు ప్రవీణ్‌కుమార్ గౌడ్, కోశాధికారి ఇంద్రాల స్వాతిక్, కోశాధికారి బద్దం మధుసూదన్, బిల్డింగ్ ఆర్కిటెక్ శ్రీకాంత్‌ను సీపీ డీఎస్ చౌహాన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం పోలీస్‌స్టేషన్ ప్రాంగణంలో సీపీ డీఎస్ చౌహాన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, జాయింట్ సీపీ సత్యనారాయణ మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ డీసీపీ సాయిశ్రీ, ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, నాగోల్ డివిజన్ కార్పొరేటర్ చింతల అరుణ, నాగోల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎల్బీనగర్ ఇన్స్పెక్టర్ అంజిరెడ్డి, నాగోల్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు తూర్పాటి చిరంజీవి, నాయకులు అనంతుల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.