ట్రాఫిక్ చిక్కులు తొలగించేలా.. ఎస్ఆర్డీపీ కింద ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించి.. అందుబాటులోకి తెస్తున్నది. ఇందులోభాగంగా రూ. 143. 58 కోట్లతో చేపట్టిన నాగోల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు తుది దశకు చేరాయి. ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ) : విస్తరిస్తున్న హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థను మరింత మెరుగు పరిచే క్రమంలో ఎస్ఆర్డీపీతో చేపట్టిన నాగోల్ ఫ్లై ఓవర్ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెలాఖరులోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు సోమవారం అధికారులు తెలిపారు. దీంతో ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వరకు అకడి నుంచి వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు, సికింద్రాబాద్, ఈసీఐఎల్ ప్రాంతాలకు సులభంగా రాకపోకలు సాగించవచ్చు.
ఫ్లైవర్ వివరాలు
నాగోల్ ఫ్లై ఓవర్ భూసేకరణ, యుటిలిటీ షిఫ్టింగ్‌కు రూ.143.58 కోట్ల వ్యయం కాగా రూ. 69కోట్ల వ్యయంతో 990 మీటర్ల ఫ్లై ఓవర్ కారిడార్‌ను చేపట్టారు. 200 ఫీట్ల వెడల్పుతో మాస్టర్ ప్లాన్‌ను ప్రతిపాదించారు. రెండు మార్గాలు కలిగిన ఫ్లై ఓవర్ 24 మీటర్ల వెడల్పు 6 లైన్ల బై డైరెక్షన్ క్యారేజ్ వే చేపట్టారు. 23 పిల్లర్స్, 22 స్పాన్స్‌తో 600 మీటర్ల వయాడక్ట్ పొజిషన్, 300 మీటర్ల అప్రోచ్ పొడవుతో ఆర్ఈ వాల్ చేపట్టారు. ఈ ఫ్లై ఓవర్ వలన ఎల్బీనగర్ నుంచి ట్రాఫిక్‌కు సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.