సిటీబ్యూరో/మారేడ్‌పల్లి: ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే నుంచి గానీ తాము ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, కొందరు తప్పుడు ఆరోపణలు చేయడం తగదని ముత్యాలమ్మ ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నారు. ఆదివారం ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కమిటీ సభ్యులు సంతోష్, కిరణ్, సాయిప్రకాశ్, కిషన్, ఎల్లేశ్, వైష్ణవి, సోను మాట్లాడారు.
ఈ నెల 19న మినిస్టర్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే శ్రీ గణేశ్ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశామని, గుడి పునర్నిర్మాణానికి ఎమ్మెల్యే రూ.10 లక్షలు, ప్రభుత్వం తరఫున రూ. 10 లక్షలు అందిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారని చెప్పారు. ఈ విషయాన్ని ఆలయం వద్దకు వచ్చి ముందే చెప్పామని, అందరి సమక్షంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పినట్లు వివరించారు. ఇప్పటి వరకు ఎవరి వద్ద నుంచి ఒక్క రూపాయి కూడా డబ్బులు తీసుకోలేదని…ఆలయ కమిటీ పై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందో బస్తును ఏర్పాటు చేశారు. శనివారం హిందూ ధార్మిక సంఘాల ఇచ్చిన సికింద్రాబాద్ బంద్ సందర్భంగా వేలాది మంది హిందువులు, బీజేపీ నాయకులు ఆలయ వద్ద చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతగా మారడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ నేపథ్యంలో ముత్యాలమ్మ ఆలయానికి వెళ్లే దారుల్లో పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. బయటి వ్యక్తులను ఎవరినీ కూడా ఆలయం వైపు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. స్థానికులను మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.