సిటీబ్యూరో, జూలై 3 (నమస్తే తెలంగాణ) : మాంసంహార ప్రియులు జర జాగ్రత్త.. ముక్క తినాలనుకునే ముందు ఆ ముక్క మంచిదా? కాదా? అని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మాంసం కొనుగోలు సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా..అనారోగ్యబారిన పడక తప్పదు. ఎందుకంటే జీహెచ్ఎంసీ వైద్యాధికారుల నుంచి స్టాంపింగ్ (ధ్రువీకరణ) లేని మాంసాన్ని విక్రయిస్తున్నారు.
వాస్తవంగా ఆరోగ్యంగా ఉన్న జంతువులనే వధించి విక్రయించాల్సి ఉండగా.. పలు రకాల వ్యాధులు సోకిన వాటిని వధించి రిటైయిల్ మాంసం దుకాణాలను సరఫరా చేస్తున్నట్లు ఇటీవల జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదులు వెలువెత్తుతున్నాయి. సర్టిఫైడ్ స్టాంప్ లేకుండా జరుగుతున్న మాంసం విక్రయాలపై దృష్టి పెట్టాల్సిన జీహెచ్ఎంసీ మెడికల్, వెటర్నరీ అధికారులు కనీసం అటు వైపు కన్నెత్తి చూడని ఫలితంగానే ప్రమాదకర మాంసం విక్రయాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
స్లాటర్ హౌస్‌లో కాకుండా ఎకడపడితే అకడ స్లాటరింగ్ చేస్తూ విక్రయాలు చేపడుతున్న మాంసం దుకాణదారులపై ఇప్పటికైనా బల్దియా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు చేపట్టాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. నామమాత్రంగా చలాన్లు వేస్తూ వదిలేస్తే యధావిధిగా వారి అక్రమ మాంసం విక్రయాలు కొనసాగిస్తూనే ఉంటారని, కచ్చితమైన చర్యలు తీసుకుంటే తప్ప వీరికి అడ్డుకట్ట వేయలేమని తక్షణ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకుంటూ ఎకడ పునరావృతం కాకుండా చూసుకోవాలని మరి కొంతమంది డిమాండ్చేస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా చాలా చోట్ల ఎకడ పడితే అకడ మాంసం దుకాణాలు వెలుస్తున్నాయి. మాంసం దుకాణాలు ఏర్పాటు చేయాలంటే స్థానిక మున్సిపల్ అధికారుల నుంచి అనుమతులతో పాటు ట్రేడ్ లైసెన్స్ కూడా పొందాల్సి ఉంటుంది. అలాగే వారి దుకాణాల్లో అమ్మే మాంసాన్ని ఏ స్లాటరింగ్ హౌస్ నుంచి తీసుకొస్తున్నారని అంశాన్ని కూడా అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది.
ఇలా సంబంధిత అధికారుల నుంచి అనుమతులు తీసుకొని ఏర్పాటు చేసిన మాంసం దుకాణాలపై ఎప్పటికప్పుడు జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు, శానిటేషన్ అధికారులు వారు తీసుకొచ్చేటువంటి మాంసం స్లాటరింగ్ హౌస్ నుంచి తీసుకొస్తున్నారా.. ఆ మాంసంపై గవర్నమెంట్ వెటర్నరీ డాక్టర్ సర్టిఫై చేసిన స్టాంప్ ఉందా అనేది నిత్యం చెక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అధికారులు చేసిన తనిఖీల్లో సర్టిఫై చేసిన మాంసం కాకుండా వేరొక మాంసం విక్రయిస్తున్నట్లు నిర్ధారణ అయితే సదరు దుకాణదారులపై చర్యలు తీసుకునే అధికారం కూడా వెటర్నరీ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ మెడికల్ అధికారులకు కూడా ఉంటుంది. బల్దియా అధికారుల నిస్సాహాయ తీరు అక్రమ మాంస విక్రయదారులకు అవకాశంగా మార్చుకుని విచ్చలవిడిగా మాంసం విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని మాంసం దుకాణాదారులు జీహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం ఆమోదించిన మాంసాన్నే అమ్మాలి. అంబర్‌పేట, రామ్నాస్పుర, న్యూబోయిగూడ, చెంగిచర్ల స్లాటర్‌హౌస్‌ల నుంచి తీసుకొచ్చిన మాంసాన్నే వ్యాపారులు అమ్మాలి. ముందుగా ఈ స్లాటర్‌హౌస్‌లో గొర్రె, మేక కానీ ఆరోగ్య స్థితిని డాక్టర్ పరీక్షిస్తారు. యాంటీమార్టం, పోస్టుమార్టం చేసిన తర్వాతనే ఆయా మాంసం తినొచ్చని నిర్థారిస్తూ జీహెచ్ఎంసీ అధికారులు స్టాంప్ వేసి వ్యాపారులకు ఇస్తారు.
కట్ చేసిన గొర్రె, మేక తోడభాగంలో స్లాటర్‌హౌస్, తేదీ, రశీదులో సమగ్ర వివరాలతో వ్యాపారునికి అందిస్తారు. సదరు వ్యాపారి ఆయా షాపు ద్వారా అమ్మకాలు జరుపుతారు. మాంసం కొనుగోలు చేసే వారు స్టాంప్ ఉన్న మాంసాన్నే కొనుగోలు చేయాలి. కానీ అడ్డగోలుగా వెలిసిన మటన్ దుకాణాల్లో ఎకడ కూడా స్టాంప్ వేసిన ఆనవాళ్లు కనబడట్లేదు. స్టాంప్ లేకుండా తకువ ధరకు దొరికే మాంసాన్ని తీసుకొచ్చి వారి వారి ప్రాంతాల్లో దుకాణాల్లో పెట్టి ఎకువ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మటన్ షాప్ నిర్వాహకులు.
ప్రజల సైతం ఎకడో స్లాటర్ హౌస్‌లో కోసిన మాంసం కంటే మన కండ్ల ఎదుట కోసిన మాంసం కదా అంటూ ఎగబడి క్యూలో నిలబడి మరి కొనుగోలు చేస్తున్నారు. ఎలాంటి గుర్తింపు లేకుండా.. వెటర్నరీ అధికారి సర్టిఫై చేయని మేకలను లైవ్ మటన్ పేరు మీద అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాంటి అనధికార మటన్ షాపులపై చర్యలు తీసుకోవాల్సిన వెటర్నరీ అధికారులు వారిచ్చే ముడుపుల మాటున చూసీ చూడనట్టు వ్యవహరిస్తూ.. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు.